పవన్! మోడీపై ఒత్తిడి తే, జగన్‌ని జైలుకి పంపు: విహెచ్
హైదరాబాద్: కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కలవడాన్ని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు సోమవారం మండిపడ్డారు. అవినీతి కేసుల నుండి బయట పడేందుకే మోడీని జగన్ కలిశారని విమర్శించారు.
నరేంద్ర మోడీ అవినీతిపరులను అక్కున చేర్చుకోవద్దని హితవు పలికారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపేందుకు నరేంద్ర మోడీ పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒత్తిడి తేవాలని సూచించారు. జగన్, కెవిపి రామచంద్ర రావును జైలుకు పంపాలని ఆయన వ్యాఖ్యానించారు.

అధికారులపై బొజ్జల
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా కొందరు రెవెన్యూ, పోలీస్ అధికారులు ప్రయత్నించారని శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఇకనైనా వారు తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సమయంలో టిడిపి కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలన్నారు.
ఎవరో ముఖ్యమంత్రి అవుతారని, ఏదో చేస్తారని కొందరు నేతలు, అధికారులు కలలు కన్నారని, అందుకని అధికారులు ఎన్నికల సమయంలో పక్షపాతవైఖరితో పని చేశారని ఆరోపించారు. ఎవరు ఎలా పని చేసింది టిడిపి కార్యకర్తలకు తెలుసునని, అయితే వారిపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, వాళ్ళు తమ తీరును మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications