వైసీపీ ఓటమి ఖాయం- ఓటు చీలనివ్వను: ఎవరికీ కొమ్ము కాయను - సీఎంకు పవన్ సవాల్..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీని మరోసారి టార్గెట్ చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసారు. ఎవరికీ కొమ్ము కాయనని తేల్చి చెప్పారు. వ్యూహం తనకు వదిలేయమని చెప్పిన పవన్.. జనసేన అధికారంలోకి వస్తుందన్నారు. కొత్త ప్రభుత్వాన్ని తీసుకురాకపోతే ఏపీ భవిష్యత్ అంధ కారమవుతుందన్నారు. తాను వరాహీలోనే రాష్ట్రంలో తిరుగుతానని ఎవరైనా అడ్డుకుంటే తానేంటే చూపిస్తానన్నారు. సీఎం ను వచ్చి ఆపమనండి అంటూ పవన్ సవాల్ చేసారు.

వైసీపీ గెలవకుండా చూసే బాధ్యత నాది..
వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి గెలవకుండా చూసే బాధ్యత తనదేనని పవన్ స్పష్టం చేసారు. 2019 ఎన్నికల్లో తిరిగి 2014 తరహాలో పొత్తులతో పోటీ చేసి ఉంటే వైసీపీ గెలిచేది కాదన్నారు. ఒక వేళ గెలిచినా.. బలమైన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉండేదన్నారు. తాను మద్దతిచ్చినా టీడీపీని నిలదీసానని గుర్తు చేసారు. తనకు ఎటువంటి ఆశలు లేవన్నారు. ప్రజలకు మేలు చేయటమే లక్ష్యమని స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ హింసకు దిగుతుందని ఆరోపించారు. జనసైనికుల కోసం తాను రక్తం చిందించటానికైనా..జైలుకు వెళ్లటానికైనా సిద్దమని పవన్ చెప్పుకొచ్చారు. ఎన్నికలకు సంబంధించి వ్యూహం తనకు వదిలేయాని.. జనసేన అధికారంలోకి రావాలని కోరుకొనే వారు కష్టపడాలని పిలుపునిచ్చారు. తాను ఎవరి కొమ్ము కాయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అధికారం చూడని కులాలకు అధికారం ఇవ్వటమే తన లక్ష్యమని పవన్ స్పష్టం చేసారు.

వారాహీలో వస్తా..ఆపటానికి సీఎంను రమ్మనండి
తాను ఏపీ రోడ్ల పైన తన వారాహీతోనే వస్తానని పవన్ ప్రకటించారు. ఎవరైతే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారో..వాళ్లు వారాహిని ఆపే ప్రయత్నం చేయాలని..అప్పుడు తానేంటో తెలుస్తుందని పవన్ హెచ్చరించారు. ఆపటానికి మీ సీఎంను రమ్మనండి అంటూ పవన్ సవాల్ చేసారు. తాను చెప్పింది చేయకపోతే..తాను తప్పు చేస్తే నా చొక్క పట్టండంటూ పవన్ పేర్కొన్నారు. తనను వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారని చెప్పిన పవన్... వారానికి ఒకసారి వస్తేనే తనను తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. జనసేనకు అధికారం ఇస్తే అవినీతి రహిత పాలన ఇస్తామని పవన్ చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ
ఓటు చీలకుండా ఎలా ఆడాలన్నదే తన లక్ష్యమన్నారు. తాను ప్రజలకు తప్ప ఎవరికీ కొమ్ము కాయనని స్పష్టం చేసారు. ఏపీ కోసం వ్యూహం ఉంటుందని..తనకు ఏ అవసరాలు లేవని వివరించారు. వైసీపీ ఎన్నికల్లో ఏ రకంగా వ్యవహరించబోతోందో తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఎవరూ భయపడవద్దని తాను అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు.

కాపుల గుండెల్లో అంబటి ఓ బండ
మంత్రి అంబటి రాంబాబు పైన పవన్ విరుచుకుపడ్డారు. వైసీపీ కాపుల నేతలతో బూతులు తిట్టిస్తున్నారన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని వ్యక్తి ఇరిగేషన్ మంత్రా అని ఎద్దేవా చేసారు. వైసీపీ నేతలవి అన్నీ పనికిమాలిన మాటలేనని ఫైర్ అయ్యారు. కాపుల గుండెల్లో అంబటి ఒక బండ గా పేర్కొన్నారు. అంబటి శవాలైన పేలాలు ఏరుకొనే మనస్తత్వమని విమర్శించారు. బీసీలకు - కాపులకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని నిలదీసారు. కాపులకు ఫీ రీయంబర్స్ మెంట్ చేయాలని డిమాండ్ చేసారు. తనను పీకేస్తే మళ్లీ మొలుస్తానని.. తొక్కేస్తే మళ్లీ లేస్తానంటూ పవన్ చెప్పుకొచ్చారు. తనకు సినిమాలే ఆధారమని..తాను అంబటి లాగా కాదని విమర్శించారు. అందరూ కోరుకుంటే తాను సీఎంను అవుతానని పవన్ చెప్పుకొచ్చారు. నిరుద్యోగ యువతకు వయో పరిమితి పెంచాలని పవన్ డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications