ఎపి రాజధాని: భూసేకరణపై పవన్ కళ్యాణ్ దీక్ష?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానికి రాష్ట్ర ప్రభుత్వం చేయదలుచుకున్న భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు జనసేన అధినేత, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బలవంతపు భూసేకరణ జరిపితే తాను ప్రజలకు అండగా నిలుస్తానని, బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తానని పవన్ కళ్యాణ్ మార్చిలో రాజధాని ప్రాంతంలో పర్యటించినప్పుడు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవడానికి ఏ విధంగా ముందుకు రావాలనే వ్యూహాన్ని ఆయన వర్గం ఖరారు చేస్తున్టన్లు చెబుతున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టకూడదని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
భూసేకరణకు వ్యతిరేకంగా ఆయన దీక్ష చేపట్టాలని అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మే 23వ తేదీన దీక్ష చేపడితే ఎలా ఉంటుందనే ఆలోచన సాగుతున్నట్లు చెబుతున్నారు. బేతపూడి, రాయపూడి వంటి రెండు మూడు ప్రదేశాల్లో దీక్ష చేపట్టాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే, అధికారికంగా మాత్రం పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారి నుంచి మాత్రమే భూమి తీసుకోవాలని, బలవంతంగా భూములు లాక్కోవద్దని పవన్ కళ్యాణ్ గతంలో ప్రభుత్వానికి సూచించారు.

చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు మధ్య సంబంధాలు సజావుగానే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాలంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు నియామకం విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన సూచనను మన్నించినట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ దీక్ష చేసినా అది కేవలం నిరసన వ్యక్తం చేయడమే తప్ప తీవ్రమైన విషయం కాకపోవచ్చునని టిడిపి వర్గాలంటున్నాయి.
బలవంతంగా భూములు సేకరిస్తే తాను నిరాహార దీక్షకు దిగుతానని పవన్ కళ్యాణ్ గతంలో అన్నారు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఆయన దీక్ష చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications