Pawan Kalyan ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. చిరంజీవి తమ్ముడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ తన సొంత ప్రతిభతో పవర్ స్టార్‌గా ఎదిగారు. రాజకీయపార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనే పట్టుదలతో అడుగులు వేస్తున్నారు. కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న పవన్ వారికి ఇస్తున్న పరిహారాన్ని తన సొంత ఆదాయం నుంచే వెచ్చిస్తున్నారు. దీనిపై అన్నివర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీని నడపాలంటే పారితోషికమే ఆధారం!
ఒక సినిమాకు ఆయన తీసుకునే ఆదాయం కోట్లరూపాయల్లోనే ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. సినిమాలు తక్కువ చేసినా బ్లాక్ బస్టర్ హిట్లు ఉండటంతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటైంది. జనసేన పార్టీని నడపడానికి తన సొంత సొమ్మునే వినియోగిస్తున్నారు. పార్టీకి విరాళాలు వచ్చే అవకాశం లేకపోవడం, రెండు రాష్ట్రాల్లోను నడపాలంటే ఖర్చులు ఎక్కువగా ఉండటంతో సాధ్యమైనంత వేగంగా సినిమాలు చేస్తూ వాటిమీద వచ్చే ఆదాయాన్ని పార్టీకి ఉపయోగిస్తున్నారు.

సమాజం కోసం ఆలోచించడంవల్లే ఆదాయంలో వెనకబడ్డారు?
సినీ పరిశ్రమలో ఆయనకన్నా ముందున్నవారు, ఆయన తర్వాత వచ్చినవారంతా కోట్లరూపాయల సొమ్ములు సంపాదించుకున్నారు.. సంపాదించుకుంటున్నారు. వాటిని రెట్టింపు చేసుకుంటూ పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. సమ సమాజ స్థాపన కోసం, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఉండే పవన్‌పై విప్లవ భావాలు వ్యక్తమయ్యే రచయితల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనన్ని ఎక్కువ పుస్తకాలు చదువుతారు. పవన్ కు సంపాదనకన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయనే విషయం పరిశ్రమలో అందరికీ తెలిసిందే. తన సినిమాలవల్ల ఎవరైనా నష్టపోతే పారితోషికంలో సగం వెనక్కిచ్చేస్తుంటారు. తమ నాయకుడు కేవలం డబ్బుల కోసం పరిశ్రమలో ఉంటే కోట్లరూపాయలు సంపాదించుకోగలరుకానీ సమాజం కోసం ఆలోచిస్తారని, అందుకే తన ఆదాయం మొత్తం సమాజానికే ఉపయోగిస్తున్నారని జనసేన నేతలు చెబుతున్నారు.

ఇల్లు, ఫామ్ హౌసే మిగిలాయి!!
పరిశ్రమలో మొదటి నుంచి కార్మికులకు కూడా సాయం చేస్తుంటారని, డబ్బుల గురించి ఆలోచించకపోవడంవల్లే ఆయనకు రూ.150 నుంచి రూ.200 కోట్ల లోపు ఆస్తులే ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ లో ఇల్లు, ఒక ఫామ్ హౌస్ మాత్రమే ఉందని, తనకంటూ ఏమీ లేకుండా సమాజం కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టే ఆస్తులు కూడబెట్టలేకపోయారంటున్నారు. సినిమాలు కూడా మానేసి పూర్తిగా రాజకీయాలకే అంకితమైతే పార్టీని నడపడం కష్టమవుతుందనే ఉద్దేశంతో సినిమాలు చేస్తున్నారని, లేదంటే సినీ పరిశ్రమను కూడా వదిలేసేవారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications