Pawan Kalyan: బుక్ ఫెస్టివల్ లో రూ.10 లక్షల విలువైన పుస్తకాలు కొన్న పవన్-దాని కోసమే..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో సంచలనం సృష్టించారు. విజయవాడలో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ ను ఇవాళ మరోసారి సందర్శించిన పవన్.. భారీగా పుస్తకాలను కొనుగోలు చేశారు. అదీ ఏ స్ధాయిలో అంటే ఏకంగా రూ.10 లక్షల రూపాయల విలువైన పుస్తకాలను పవన్ కొన్నారు. దీంతో విజయవాడ బుక్ ఫెస్టివల్ లో ఒకేసారి ఇంత భారీ మొత్తంలో పుస్తకాలు కొన్న రికార్డు నెలకొల్పినట్లయింది.
విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి హాజరైన పవన్ కళ్యాణ్ ఇవాళ మరోసారి బుక్ ఫెస్టివల్ లోని స్టాల్స్ సందర్శనకు వచ్చారు. తన కోసం ప్రత్యేకంగా ఉదయం పూట రెండు గంటలు స్టాల్స్ ఓపెన్ చేయాలని పవన్ విజ్ఞప్తి చేయడంతో నిర్వాహకులు అంగీకరించారు. పవన్ కోసం రెండు గంటల పాటు ప్రత్యేకంగా స్టాల్స్ ఓపెన్ చేసి పెట్టారు. దీంతో పవన్ మీడియాతో పాటు ఎలాంటి హడావిడి లేకుండా వ్యక్తిగతంగా వెళ్లి బుక్స్ ను తీరిగ్గా పరిశీలించి ఇంత భారీ ఆర్డర్ చేశారు.

పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో యువత కోసం ఓ మంచి లైబ్రరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీని కోసమే ఇంత భారీ ఎత్తున రూ.10 లక్షలు సొంత డబ్బులు వెచ్చించి మరీ భారీగా పుస్తకాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

దీంతో పవన్ పిఠాపురం లైబ్రరీ కోసం తీసుకున్న పుస్తకాలను ఆయన కారులోనే తీసుకెళ్లినట్లు సమాచారం. పవన్ బుక్ ఫెస్టివల్ సందర్శనను జనసేన పార్టీ కూడా గోప్యంగా ఉంచింది. అయితే పార్టీ తరఫున ఫొటోలు మాత్రం విడుదల చేశారు. సహజంగానే పుస్తకాల పురుగు అయిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 లక్షల పుస్తకాలు చదివినట్లు పలుమార్లు చెప్తుంటారు. అలాగే పలు బుక్ ఫెస్టివల్స్ కు వెళ్లడం ఆయనకు అలవాటే. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతానని కూడా పవన్ గతంలో చాలాసార్లు చెప్పారు. అలాగే తన ప్రసంగాల్లోనూ తాను చదివిన పుస్తకాల్లో కోట్స్ కూడా వాడుతుంటారు.












Click it and Unblock the Notifications