బీజేపీ టు పవన్ కళ్యాణ్: వ్యూహాత్మకంగా.. జగన్‌ను లెక్కచేయని బాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తున్నారని అంటున్నారు. ఇటు అధికార, అటు ప్రతిపక్షంలోను దీనిపై చర్చ సాగుతోందట.
ఓ వైపు బీజేపీతో దోస్తీని వదులుకోకుండా, మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినప్పుడు స్పందించడం ద్వారా జగన్‌ను ఇరకాటంలోకి నెడుతున్నారని అంటున్నారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించినప్పటికీ.. ఆ తగ్గడం ద్వారా జగన్‌కు ఛాన్స్ లేకుండా చేస్తున్నారంటున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఫుడ్ పార్క్ అంశంపై పలువురు బాధితులు పవన్ వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మరుసటి రోజే చంద్రబాబు రంగంలోకి దిగారు. అంతా సర్దుకుపోయేలా ప్రయత్నాలు చేశారు.

అయితే, ఈ నెల 19వ తేదీన జగన్ అక్కడే పర్యటించనున్నారు. అంతకుముందే, చంద్రబాబు ఫుడ్ పార్క్ పైన ప్రజలను మెప్పించేలా చేయాలని స్థానిక ఎమ్మెల్యేలను ఆదేశించడం గమనార్హం. గతంలోను ఇలాగే జరిగాయని చెప్పవచ్చు. ప్రత్యేక హోదా, రాజధాని భూసమీకరణ విషయంలోను పవన్ రంగంలోకి దిగారు.
పవన్ రంగంలోకి దిగిన ప్రతి అంశం పైన చంద్రబాబు ప్రభుత్వం స్పందించింది. ఆయన సూచనలు పాటిస్తామని చెప్పింది. కానీ వైసిపిని మాత్రం ఏమాత్రం పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. తద్వారా మంచి సూచనలు ఇస్తే పాటిస్తామని చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు.
మిత్రపక్షమైనా, ప్రతిపక్షమైన రాష్ట్ర అభివృద్ధికి సూచనలు ఇస్తే తాము స్వీకరిస్తామని... పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న సమస్యల పైన స్పందించడం ద్వారా తెలుస్తోందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. వైసిపి, ఆ పార్టీ అధినేత జగన్ రాజకీయాలు చేస్తున్నారని, మంచి సలహాలు మాని ప్రయోజనాలు ఆశిస్తున్నారని టిడిపి చెబుతోంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం చెప్పింది. అయినప్పటికీ ఏపీ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో సఖ్యత అవసరమని చంద్రబాబు, టిడిపి నేతలు చెప్పారు. ఏపీకి హోదా అవసరమని, కానీ ఇబ్బందులు ఉన్నందున దానికి సరిపడా ప్యాకేజీ ఇస్తామని చెబుతున్నారని, కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని టిడిపి చెబుతోంది.
తద్వారా బీజేపీ విషయంలోను ఓ అడుగు వెనక్కి వేస్తూ కలిసి నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే స్పందిస్తోంది. బీజేపీ హోదా పైన వెనుకడుగు వేసినా ఏపీ ప్రయోజనాల దృష్డ్యా కేంద్రం సహకారం అవసరమని చెబుతూ మిత్రపక్షంగానే ఉంటామని అంటోంది. ప్రతిపక్షం విషయంలో మాత్రం టిడిపి డోంట్ కేర్ అన్నట్లుగా ఉంటోందని అంటున్నారు. వైసిపి రాజకీయ లబ్ధి మాత్రమే చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications