జనసేన ప్రభుత్వ అజెండా ఇదే..! కాకినాడలో వెల్లడించిన పవన్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓవైపు విపక్షాలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు తనను సీఎం చేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తులు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తన పార్టీని అధికారంలోకి తేవాలని, తనను సీఎం చేస్తే మార్పు చూపిస్తానని చెబుతున్న పవన్.. తన ప్రభుత్వం వస్తే ఏం చేస్తాననేది కూడా వెల్లడించారు.
ఇవాళ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కాకినాడలోకి ప్రవేశించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉదయం స్ధానికంగా నగర ప్రముఖులతో పాటు మేథావులతో భేటీ అయ్యారు. వారితో తాజా పరిస్ధితులపై చర్చించారు. అనంతరం జనసేన ప్రభుత్వం ఏర్పాటు, అధికారం చేపట్టాక తన అజెండా ఎలా ఉంటుందన్న దానిపై వారికి వివరించారు. ఇందులో ముఖ్యంగా పవన్ నాలుగు అంశాల్ని ప్రస్తావించారు. వీటి ఆధారంగా తన పాలన ఉంటుందని వారికి పవన్ స్పష్టం చేశారు.

జనసేన పాలనలో జవాబుదారీతనానికి పెద్ద పీట వేస్తామని పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడలో హామీ ఇచ్చారు. స్వచ్ఛత, బాధ్యత, పారదర్శకతతో వ్యవహరిస్తామన్నారు. అద్భుతమైన పోర్టు ఉన్న కాకినాడకు అన్ని విధాలా అభివృద్ధి అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని తెలిపారు. తీర ప్రాంతం ఉన్నచోట అభివృద్ధి అనేది సహజంగా ఉంటుందని, అయితే అందరి మాటలు విన్న తర్వాత కాకినాడ నగరం అనుకున్నంతగా అభివృద్ధి సాధించలేకపోయింది అని అర్థమవుతుందన్నారు. పాలకుల తీరు దీనికి ఒక కారణం అయితే, అవినీతిమయమైన నాయకులను ప్రజలు చట్టసభలకు పంపించడం కూడా మరో కారణమన్నారు.

జనసేన పాలనలో స్వచ్ఛత, బాధ్యత, పారదర్శకత, సుపరిపాలన అనే అంశాలనే ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ముఖ్యంగా జవాబుదారీతనానికి పెద్ద పీట వేస్తామన్నారు. ప్రజా పద్దులోని ప్రతి రూపాయికి కచ్చితంగా ప్రజలకు లెక్క చూపించే బాధ్యతను తీసుకుంటామన్నారు.సహజ వనరుల దోపిడీని పూర్తిగా అరికట్టేలా చర్యలు ఉంటాయన్నారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనులకు బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు.

సమాజంలో ఉన్న వారందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే నిర్ణయాలు ఉంటాయని పవన్ తెలిపారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా అది ఏ వర్గాలను ప్రభావితం చేస్తుందో వారి అందరి నిర్ణయాలు విన్న తర్వాతే ముందుకు వెళ్లాలి అన్న దానిపై జనసేన కట్టుబడి ఉందన్నారు. అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, మేధావులుతో పూర్తిస్థాయిలో చర్చిస్తున్నామన్నారు. చెప్పే ప్రతి మాటను వింటున్నామని, ఇది కచ్చితంగా జనసేన ప్రభుత్వంలో సుపరిపాలనకు దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు పవన్ అన్నారు.












Click it and Unblock the Notifications