వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్ సభా మైదానానికి పేరు: ఎవరీ తరిమెల నాగిరెడ్డి?

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలినాళ్లలో విప్లవ భావాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఈ విషయాన్ని వివిధ సందర్బాల్లో ఆయనే స్వయంగా చెప్పారు. విప్లవ గాయకుడు, కవి గద్దర్ అంటే అభిమానమని కూడా ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన అనంతపురం సభా మైదానానికి తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టినట్లు భావించవచ్చు. పైగా, తరిమెల నాగిరెడ్డి అనంతపురం జిల్లాకు చెందినవారు.

శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి విప్లవ మార్గం పట్టిన నాయకుడు తరిమెల నాగిరెడ్డి. తాకట్టులో భారతదేశం ఆయన రాసిన గొప్ప గ్రంథం. అది ఎందరికో ప్రేరణగా నిలిచింది. తరిమెల నాగిరెడ్డి అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో 1917 ఫిబ్రవరి 11వ తేదీన రైతు కుటుంబంలో జన్మించారు.

మద్రాసులోని లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో తన జాతీయతా భావాల కారణంగా కళాశాల యాజామాన్యంతోనూ, ఆచార్యులతోనూ నాగిరెడ్డికి పడలేదు. జవహర్ లాల్ నెహ్రూ బహిరంగ ఉపన్యాసాలకు హాజరైనందుకూ, రామస్వామి ముదలియార్ కు, సత్యమూర్తికి మధ్య జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు, వ్యాసరచనా పోటీలలో మహమ్మద్ బిన్ తుఘ్లక్ ను ప్రశంసించినందుకు, కళాశాల యాజమాన్యం ఆయనకు పలుమార్లు జరిమానా విధించింది.

నాగిరెడ్డి లయోలా కళాశాల తరువాత వారణాసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదివారు. వారణాసిలో ఉన్న నాలుగేళ్ళలో నాగిరెడ్డి కమలాదేవి ఛటోపాధ్యాయ, జయప్రకాశ్ నారాయణ్, అచ్యుత్ పట్వర్ధన్ వంటివారితో ప్రభావితుడయ్యాడు. కమ్యూనిజం, మార్క్సిజంతో ఆయనకు వారణాసిలోనే పరిచయం కలిగింది.

Tarimela Nagireddy

గాంధీ లేఖ

రష్యన్ విప్లవాన్ని, స్టాలిన్ నాయకత్వం గురించి విస్తృతంగా అధ్యయనం చేశారు. భారతదేశంలో కూడా మార్క్సిజాన్ని అమలు చేయడానికి వీలుందనే విశ్వాసాన్ని ఏర్పరచుకున్నాడు.. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఉపకులపతిని నిలదీశారు. మహాత్మాగాంధీకి అది తెలిసింది. దాంతో వైస్ ఛాన్సలర్‌కి క్షమాపణలు చెప్పాలని గాంధీ నాగిరెడ్డికి ఉత్తరం రాశారు. ఆయన అందుకు ఆయన అంగీకరించలేదు.

నాగిరెడ్డి తన ప్రభుత్వ వ్యతిరేక రాజకీయకలాపాల కారణంగా పలు మార్లు జైలుకు వెళ్లాడు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ, ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం అనే పుస్తకం రాసి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. ఆ కారణంగా ఆయన జైలుకు వెళ్ళాడు. తిరుచిరాపల్లి జైలునుండి విడుదల కాగానే మళ్లీ 1941లో భారతీయ రక్షణ చట్టం కింద అరెస్టయ్యాడు. 1946లో ప్రకాశం ఆర్డినెన్సు కింద అరెస్టయి 1947లో విడుదలయ్యారు.

మద్రాసు శాసనసభకు ఎన్నిక

1952లో నాగిరెడ్డి మద్రాసు శాసనసభకు సిపిఐ అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. అప్పుడు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. జైలులో ఉండి కూడా ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, తన బావ అయిన నీలం సంజీవరెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు. 1955లో కొత్తగా ఏర్పడిన పుట్లూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి తరిమెల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు.

1957లో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండవ లోక్‌సభకు ఎన్నికయ్యారు. తిరిగి 1962లో పుట్లూరు నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సిపిఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 1967లో నియోజకవర్గాల పునర్విభజనలో పుట్లూరు నియోజకవర్గం రద్దుకాగా, సిపిఐ (ఎం) అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి మూడో పర్యాయం శాసనసభకు ఎన్నికయ్యారు. 1969లో మార్చి నెలలో శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి విప్లవ మార్గం పట్టారు.

1968లో నాగిరెడ్డి సి.పి.ఐ (ఎం) నుండి విడిపోయి ఆంధ్ర ప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిష్ట్ రెవల్యూషనరీస్‌ (ఎ.పి.సి.సి.ఆర్) - ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీ‌ని స్థాపించారు. సి.పి.ఐ (ఎం) కార్యకర్తలను కొత్తపార్టీలోకి ఆకర్షించడంలో సఫలమయ్యారు. కొద్దికాలం ఎ.పి.సి.సి.ఆర్ అఖిల భారత కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీలో కలసివుంది.

నాగిరెడ్డి 1976, జులై 28న మరణించారు. ఆయన భౌతికకాయాన్ని తరిమెలకు తీసుకెళ్తుండగా కల్లూరు వద్ద పోలీసులు భౌతికకాయాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు తండోపతండాలుగా రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. పోస్టుమార్టం తర్వాత భౌతికకాయాన్ని బంధువులకప్పగించారు.

English summary
Jana Sena chief Pawan Kalyan has named for his meeting ground after Tarimela Nagi Reddy due to his revolutionary thoughts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X