బాబు నుంచి కేంద్రం దాకా వెళ్లిన పవన్ కళ్యాణ్ 'ఫైట్': ఉద్ధానంలో ఎందుకిలా?
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా సమస్య పైన నిలదీస్తే ఏపీ ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తోంది.
శ్రీకాకుళం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా సమస్య పైన నిలదీస్తే ఏపీ ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తోంది. తాజాగా, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది.
అయిదు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలో పర్యటించారు. ఇక్కడి కిడ్నీ వ్యాధి బాధితులను పరామర్శించారు. పవన్ పర్యటన ద్వారా ఈ సమస్య మరింత వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం కూడా స్పందించింది.
ఇటీవలే చంద్రబాబు స్పందించగా, పవన్ కూడా ధన్యవాదాలు తెలిపారు. తాజాగా, సోమవారం కేంద్రమంత్రి జేపీ నడ్డా కూడా స్పందించారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య పైన అధ్యయనానికి ప్రత్యేక బృందాన్ని పంపిస్తామన్నారు. ప్రత్యేక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కిడ్నీ సమస్య కారణాలు తెలుసుకుంటామన్నారు.
ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం మరిన్ని డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నాలుగు రోజుల క్రితమే ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావు చెప్పారు. చంద్రబాబు కూడా ఉద్దానంలో ఆదుకుంటామని చెప్పారు.

ప్రతి రెండిళ్లకో కిడ్నీ బాధితుడు
ఉద్ధానం ప్రాంతంలో సగటున ప్రతి రెండిళ్లకు ఓ కిడ్నీ బాధితుడు ఉంటాడు. 11 మండలాల్లోని 104 గ్రామాల్లో వ్యాధి తీవ్రంగా ఉంది. జిల్లాల్లో 25వేల మంది రోగులు ఉన్నారు. దాదాపు ఇరవై వేల వరకు దీని కారణంగా చనిపోయి ఉంటారు.

ఇక్కడే అధికం
కవిటి మండలం ఉద్దానం, పొందూరు మండలం భగవానుదాసుపరం, పలాస, సోపంటే, టెక్కలి, వజ్రపుకొత్తూరు, కంచిలి, మందస, ఇచ్చాపురం, నందిగాం, సంతబొమ్మాలి తదితర మండలాల్లో కిడ్నీ రోగులు ఉన్నారు. ఈ మండలాల పరిధిలోని గ్రామాలను ఉద్ధానంగా వ్యవహరిస్తారు.

కారణాలకు సర్వే
మూడేళ్ల కిందట హార్వార్డ్ వర్సిటీ బృందం జిల్లాలో పర్యటించి రోగాలకు గాల కారణాలను అన్వేషించింది. ఇక్కడ ప్రజలు వినియోగిస్తున్న నీటిలో సిలికాన్ అధిక మోతాదులో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. పలు వర్సిటీలు, వైద్య బృందాలు సర్వే చేశాయి. అయితే అసలైన కారణాన్ని గుర్తించలేదు. జిల్లాలో డయాలసిస్ యూనిట్లు ఉన్నా.. నెఫ్రాలజిస్టులు కరువు. దీంతో బాధితులు వైద్యం కోసం విశాఖ, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వెళ్తున్నారు.

దశాబ్ద కాలంగా పరిశోధనలు చేసినా..
గత దశాబ్దకాలంలో ఎంతో మందిని పొట్టన బెట్టుకుంది ఈ వ్యాధి. ఎందువల్ల వస్తుందో ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసిన అంతర్జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు అంతుబట్టడం లేదు. అసలేంటీ వ్యాధి? ఆ ప్రాంతానికే ఎందుకిలా జరుగుతోంది.. అన్న ప్రశ్న సగటు ఉద్దానం ప్రాంతీయుడి మదిలో ఏళ్లుగా మెదులుతూనే ఉంది.

గుర్తించలేక..
ఈ వ్యాధి బారిన పడిన రోగుల్లో చాలామంది ముందుగా దానిని గుర్తించలేకపోతున్నారు. ఏ జ్వరమో లేదా ఇతర వ్యాధి లక్షణాలతో స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు వెళ్తుంటే అక్కడి చేస్తున్న పరీక్షల్లో కిడ్నీ వ్యాధి లక్షణాలు బయటపడుతుండటం ఆ ప్రాంతంలో వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. అలా గుర్తించి చికిత్స పొందుతున్న వారిలో చాలామంది నెలలు, రోజుల వ్యవధిలోనే తనువు చాలిస్తున్నారు. కొందరు డయాలసిస్‌తో నెట్టుకొస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రయాణ ఖర్చులు కూడా భరించలేక ఎంతోమంది రోగులు డయాలసిస్‌కు కూడా వెళ్లలేకపోవడం అక్కడి దీనస్థితికి నిదర్శనం

ప్రభుత్వాలు సర్వే చేశాయి
ఉద్దానం పరిస్థితిపై గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సర్వేలు చేయించాయి. వివిధ సంస్థలకు చెందిన డాక్టర్ల బృందాలు, రాష్ట్రంలోని ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు సైతం అక్కడి నీరు, ఆహారం, ఇసుక నమూనాలను సేకరించినా ఫలితం లేకపోయింది. అమెరికాకు చెందిన హార్వర్డ్, స్టోనీబ్రూక్ విశ్వవిద్యాలయాల నుంచి నిపుణులు వచ్చి పరిశోధనల కోసం శాంపిల్స్ పట్టుకెళ్లినా ఫలితం శూన్యం.












Click it and Unblock the Notifications