Pawan Kalyan వారాహి యాత్రపై ఎన్నో ప్రశ్నలు ? జనసేన సమాధానాలివే..
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహిని బయటికి తీస్తున్నారు. ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల నుంచి వారాహిలో టూర్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే జనసేన ప్రకటన తర్వాత పవన్ టూర్ గోదావరి జిల్లాల నుంచే ఎందుకు ప్రారంభమవుతోంది ? అలాగే ఈ టూర్ నిరంతరాయంగా కొనసాగుతుందా ? దీనికయ్యే ఖర్చును ఎవరు భరిస్తున్నారు ? పవన్ తిరిగి షూటింగ్స్ కు వెళ్లిపోతారా ? వంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై జనసేన నేతలు క్లారిటీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను గోదావరి జిల్లాల నుంచే ప్రారంభించడం ఎందుకన్న ప్రశ్నను అధికార వైసీపీ నేతలు సంధిస్తున్నారు. దీంతో జనసేన నేతలు దీనిపై స్పందించారు. జనసేన పార్టీని బలోపేతం చేసుకునేందుకే పవన్ ఈ టూర్ ను తమకు కచ్చితంగా అండగా నిలుస్తాయని భావిస్తున్న గోదావరి జిల్లాల నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత క్రమంగా మిగతా జిల్లాల్లోనూ టూర్ కొనసాగనుంది.

మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు నిధులు ఎవరు సమకూర్చుస్తున్నారనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. దీనిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్ ద్వారా వచ్చే డబ్బులతోనే ఈ యాత్ర చేపడుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనసైనికులు చేస్తున్న సాయంతో ఈ యాత్ర కొనసాగనున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. దీంతో వారాహి యాత్ర పూర్తిగా పవన్, జనసైనికుల సాయంతోనే కొనసాగనుందని తేలిపోయింది.
అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 14న ప్రారంభమైన తర్వాత తిరిగి ఆయన సినిమా షూటింగ్స్ కు వెళ్లిపోతారా అన్న ప్రశ్నలు వినిపించాయి. దీనిపై స్పందించిన నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ సందర్భం వచ్చినప్పుడు పూర్తి సమయం రాష్ట్ర ప్రజలు, రాష్ట్రాభివృద్ధిపై కేటాయిస్తారని వెల్లడించారు. తద్వారా ప్రస్తుతం పూర్తి సమయం కేటాయించడం కష్టమనే సంకేతాలు ఇచ్చేశారు. కానీ రాజకీయాన్ని పక్కనబెట్టి షూటింగ్స్ చేసుకునే ఉద్దేశం లేదని, అవసరమైతే షూటింగ్స్ కోసం ఇచ్చిన కమిట్ మెంట్స్ పక్కనబెట్టి అయినా ముందుకు సాగుతారన్నారు.
మరోవైపు జనసేన పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోపైనా చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ మినీ మ్యానిఫెస్టో రిలీజ్ చేసిన నేపథ్యంలో దసరాకు పూర్తి స్దాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తారని తెలుస్తోంది. దీంతో జనసేన మ్యానిఫెస్టో ఎప్పుడన్న చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్.. ఎన్నికల సమయంలోనే మ్యానిఫెస్టో విడుదల చేస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications