'పసిపాప నుంచి రూ.11 దొంగిలించిన పవన్ కళ్యాణ్ అని స్టింగ్ ఆపరేషన్!'
Recommended Video

జంగారెడ్డిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో తాను రహస్య పూజలు చేశాననే ప్రచారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా స్టింగ్ ఆపరేషన్ పైన కూడా సెటైర్లు వేశారు. డబ్బులు ఉంటే పదవులు రావని, ప్రజాబలం, ప్రేమ కావాలన్నారు.

'పసిపాప నుంచి రూ.11 దొంగిలించిన పవన్ కళ్యాణ్' అంటారేమో
తాను సోమవారం బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేస్తే రహస్య పూజలు అని విమర్శలు చేశారని పవన్ మండిపడ్డారు. అంతెందుకు ఓ పాప పార్టీ కోసం రూ.1350 విరాళంగా ఇవ్వబోయిందని, తాను ఆమె వద్ద నుంచి రూ.11 కాయిన్స్ తీసుకొని, అన్నీ వద్దు తల్లీ అని చెప్పానని, కొందరు దానిని కూడా స్టింగ్ ఆపరేషన్ చేసేలా ఉన్నారన్నారు. 'పవన్ కళ్యాణ్ పసిపాప నుంచి రూ.11 దొంగిలించాడు' అని స్టింగ్ ఆపరేషన్ చేసేలా ఉన్నారని సెటైర్ వేశారు.

మీరే నా ఛానల్స్, పేపర్లు
బుట్టాయిగూడెంలో భూఆక్రమణలు, వేల కోట్లు దోచుకుంటే, ప్రజా సమస్యలపై ఎవరూ స్టింగ్ ఆపరేషన్ చేయడం లేదని నిప్పులు చెరిగారు. దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదన్నారు. మన వద్ద ఛానల్స్ లేవని, పేపర్లు లేవని, మీ (అభిమానులు, యువత) ఫేస్‌బుక్, వాట్సాప్‌లో మన పేపర్లు అని, మీ యూట్యూబ్ చానళ్లే మన టీవీ ఛానల్స్ అని చెప్పారు.

మార్పు ఎందుకు రాదో చూద్దాం
అప్పుడు మార్పు ఎందుకు రాదో చూద్దామని పవన్ ప్రశ్నించారు. బద్దలు కొట్టి మార్పు తీసుకు వద్దామన్నారు. సరికొత్త రాజకీయ వ్యవస్థను స్థాపిద్దామన్నారు. అభిమానులు తనపై పూలు చల్లుతుంటే.. మీ చేత్తో చల్లించుకునే అర్హత నాకు లేదని, అది మీరు ప్రేమతో చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

చింతలపూడి, ఏలూరులో గెలుస్తాం
తాను ఇప్పటి వరకు కమిటీల పైన దృష్టి సారించలేదని, మొదటిసారి జంగారెడ్డి గూడెం నుంచి కమిటీలను ప్రారంభిస్తానని చెప్పారు. మనం మొట్టమొదట గెలిచే సీటు చింతలపూడి కావాలని, ఏలూరు పార్లమెంటు కూడా మనదే కావాలన్నారు. ఏలూరు మనదైతే పోలవరంకు అండగా నిలబడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కన్నీటితో కాకుండా నిర్వాసితుల ఆనంద భాష్పాలతో ముందుకు తీసుకు వెళ్తామన్నారు. కులాల కుమ్ములాటలో అగ్రవర్ణాలు కూడా నష్టపోతున్నారని, అగ్రవర్ణాల్లోని పేదలకు అండగా నిలబడతామన్నారు.












Click it and Unblock the Notifications