వివేకా హత్యపై తేల్చేసిన పవన్ ..! ఏమీ చేయలేకపోతున్నాం..!
ఏపీలో ఆరేళ్లుగా సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదీ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వివేకా హత్య జరిగి ఆరేళ్లవుతున్నా, కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా అధికారంలో ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయతను పవన్ వ్యక్తం చేశారు.
ఇవాళ అసెంబ్లీలో వివేకా హత్యపై మాట్లాడిన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య జరిగిందని అందరికీ తెలుసని, అలా కళ్ల ముందు ఒక హత్య జరిగినా ఏమీ చేయలేకపోతున్నట్లు పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి 2015 మార్చి 15 రాత్రి వరకూ బాగానే ఉన్నారని, తెల్లవారుతూనే తన సొంత ఊరిలో సొంత ఇంట్లో శవమై కనిపించారని పవన్ గుర్తుచేశారు. అంతే కాదని, అది దారుణమైన హత్య అని పవన్ తెలిపారు. ఇది పెను సంచలనం రేపిన హత్యగా అప్పుడు, ఇప్పుడూ మాట్లాడుకుంటారన్నారు.

వివేకా హత్య కేసు విషయం చూస్తే ఏమీ తెలియలేదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే తమ దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు చెప్పిందని, మీరు ఆదేశిస్తే తిరిగి విచారిస్తామని కూడా చెప్పిందన్నారు. నిందితుల బెయిల్ విషయంలోనూ జోక్యం చేసుకోలేమని చెప్పేసిందని, ఇప్పటికే సీబీఐ ఛార్జిషీట్ కూడా ఫైల్ చేసినందున వారి బెయిల్ రద్దు చేయలేమని చెప్పిందన్నారు. తదుపరి దర్యాప్తు విషయంలో ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సునీతకు సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.












Click it and Unblock the Notifications