ఓటమి భయంతోనే జగన్ కు కోపమన్న పవన్-కేంద్రం నిధులు కావాలంటే ఓటేయాలన్న బాబు..!
కృష్ణాజిల్లా పెడనలో నిర్వహించిన టీడీపీ ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఐదేళ్ల జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విపక్షాలను ఉద్దేశించి జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో అన్ని వర్గాలను వంచించిన జగన్ కు మరోసారి ఓటేయొద్దని ప్రజల్ని కోరారు. అలాగే తాజాగా విజయవాడలో జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనను కూడా ప్రస్తావించారు.
పెడనలో ముందుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. తాను భీమవరం నుంచి ఎందుకు వెళ్లిపోయానని జగన్ బాధపడుతున్నారని ఎద్దేవ చేశారు. 70 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొదన్నారు. క్లాస్ వార్ అని చెప్పే జగన్ జాతీయ ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. జీవో 217 ద్వారా మత్స్యకారుల పట్ట కొట్టాలని ప్రభుత్వం చూసిందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించారని,ఐదేళ్లలో పదిసార్లు కరెంటు చార్జీలు పెంచారని విమర్శించారు.

అలాగే స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. నా నోటి నుంచి ఆయన పేరు చెప్పే స్థాయి లేదంటూ జోగి రమేష్ ను పవన్ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేకు పాస్ బుక్ కావాలంటే 10 వేలు, చేపల చెరువు తవ్వుకోవాలంటే లక్షన్నర లంచం ఇవ్వాలన్నారు. చేపల దాణా షాప్ పెట్టాలంటే మూడు లక్షలు, చెరువులకు మోటార్లు కూడా ఆయన చెప్పిన షాపులోనే కొనాలన్నారు.
పెడనకు డ్రైనేజీ ఇవ్వలేకపోయాడు గాని, నోటిని డ్రైనేజీగా వాడుకుంటున్నాడని అన్నారు. పేకాట క్లబ్బులు నడిపేవాడు పదవుల్లో ఎక్కాడంటూ విమర్శించారు. ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్లిన నమస్కారం పెట్టాలంట అన్నారు. లేదంటే గంజాయి కేసులు పెట్టించారని పవన్ ఆరోపించారు. మట్టి మాఫియా కోసం పోరాటం చేసిన వారిని చెట్టుకు కట్టి కొట్టించాడని జోగి రమేష్ ను విమర్శించారు.

జగన్ కు తన మీద కోపం బాగా పెరిగిపోతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జగన్ ఓడిపోతాడని కారణంతోనే ఆయనకు కోపం బాగా వస్తుందన్నారు. మమ్మల్ని జగన్ తిట్టించేకొద్దీ బలపడతాం తప్ప బలహీనపడమన్నారు. ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశాడని, చంద్రబాబు అనుభవం ఇప్పుడు చాలా అవసరమని అన్నారు. రాష్ట్రాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని తమ పార్టీ అభ్యర్థులతో ప్రమాణం చేయించానని పవన్ తెలిపారు. కాబట్టి గెలిపించడం కాదు, భారీ మెజారిటీ కావాలన్నారు.
అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. జగన్ పై తాను హత్యా ప్రయత్నం చేశాడని అంటున్నారని ఆక్షేపించారు. ప్రజల కోసం మూడు పార్టీలు కలిశామని, ప్రజల కోసం అందరం తగ్గామన్నారు. 20-30 మంది ఎమ్మెల్యేలు వైసీపీని విడిచిపెట్టారన్నారు.ఎంపీటీసీలు, జడ్పిటీసీలు సర్పంచ్ లు అందరూ ఎన్డీఏలో చేరాలని కోరారు. పట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీళ్ల సమస్య లేకుండా తీర్చామని గుర్తుచేసారు.
నోరు ఉందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు జగన్..#VarahiVijayaBheri#Machilipatnam pic.twitter.com/CTDMtu1o4Q
— JanaSena Party (@JanaSenaParty) April 17, 2024
తాము అధికారంలో ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తిచేసే వాళ్ళమన్నారు.ఐదేళ్లలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళింది...అందుకే పొత్తు పెట్టుకున్నామన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగలేదని చంద్రబాబు గుర్తుచేసారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందన్నారు. కేంద్రం నుంచి నిధులు రావాలి అంటే ఎన్డీఏకు ఓటేయాలన్నారు. మళ్లీ వైసీపీకి ఓటేస్తే మురిగిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications