‘జనసేన’కూ ఓ లెక్కుంది!: పార్టీ శ్రేణులకు పవన్ ‘గాంధీగిరి’ పాఠాలు
ఓర్పు, హుందాతనమే జనసేన పార్టీకి శ్రీరామరక్ష అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజా సమస్యలే పరమావధిగా ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు
హైదరాబాద్: ఓర్పు, హుందాతనమే జనసేన పార్టీకి శ్రీరామరక్ష అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజా సమస్యలే పరమావధిగా ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు వారి నుద్దేశించి సుదీర్ఘ ట్వీట్ చేశారు పవన్.

ఇదే నా విన్నపం..
‘జనసేన శ్రేణులు, అభిమానులకు ఒక విన్నపం. మనం పార్టీ నిర్మాణంలో ఆచరణాత్మకంగా అడుగులు వేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ముందుకు వెళుతున్నాం. ఈ తరుణంలో కొందరు పేరు కోసమో.. మన దృష్టిని మరల్చడానికో.. మనల్ని చికాకు పర్చడానికో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటివాటిపై మీరెవ్వరూ స్పందించవద్దని మనవి చేస్తున్నాను' అని పవన్ పేర్కొన్నారు.

హుందాగానే..
అంతేగాక, ‘వ్యక్తిగతంగా నాపై విమర్శలు చేసినా.. నాకు అపకీర్తి వచ్చేలా మాట్లాడినా మనం హుందాగానే ప్రవర్తిదిద్దాం. ఎందుకంటే.. ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా, బాధ్యతాయుతమైన రాజకీయ వ్యవస్థ ఆవిష్కరానికి జనసేన దృఢ నిశ్చయంతో ముందుకెళుతున్న విషయం మీ అందరికీ విదితమే. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు పరిఢవిల్లాలని బలంగా నమ్మడమే కాదు.. ఆచరణలో చూపాలన్న నా దృఢ సంకల్పంతో ఆవిర్భవించిందే జనసేన పార్టీ' అని స్పష్టం చేశారు.

సమాజ హితమే అభిమతంగా..
ఇంకా ‘మానవత్వమే మతంగా, సమాజ హితమే అభిమతంగా రూపుదిద్దుకుంటోంది జనసేన. యువత భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకు విశాల దృక్పథం కలిగిన రాజకీయాలు చాలా అవసరమని జనసేన విశ్వసిస్తోంది. ఇటువంటి తరుణంలో మనపై వచ్చే కువిమర్శలపై మీరు ఆవేశం చెందకండి. మీ ఆవేశం పార్టీకి మేలు చేయకపోగా ఒక్కోసారి హాని చేయవచ్చు' అని పవన్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.
లెక్కుంది..
‘మనపై చేస్తున్న ప్రతి కువిమర్శను పార్టీ లెక్కగడుతూనే ఉంది. అవి హద్దులు మీరుతున్నప్పుడు సమయం, సందర్భం చూసి పార్టీ స్పందిస్తుంది. అంతవరకు మీరు ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్లండి. హుందాగా పార్టీ కోసం పనిచేయండి. ఓర్పే మన పార్టీకి రక్ష. జై హింద్' అని పవన్ తన ట్వీట్‌లో వివరించారు. ఇటీవల కొందరు ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇప్పటికే సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు.. పవన్‌పై విమర్శలు చేయవద్దని సూచించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications