Pawan Kalyan : వైజాగ్ లో పవన్ వారాహి టూర్-రోడ్ షోలతో పాటు వాటిపైనా పోలీసుల బ్యాన్ ?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నేతల వరుస టూర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పథకాల పంపిణీ సభలతో జగన్, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల పర్యటనలతో చంద్రబాబు బిజీగా ఉండగా.. పవన్ కళ్యాణ్ వారాహి మూడో దశ టూర్ ప్రారంభిస్తున్నారు. వైజాగ్ లో ఇవాళ వారాహి మూడో దశ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం జగదాంబ జంక్షన్ లో మూడో దశ వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ సభ నిర్వహించబోతున్నారు.
పవన్ కళ్యాణ్ వారాహి మూడో దశ యాత్ర కోసం వైజాగ్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి స్ధానికంగా హోటల్లో బసచేసి అనంతరం సాయంత్రం జగదాంబ జంక్షన్ కు వెళ్లి అక్కడ వారాహిపై బహిరంగసభ నిర్వహిస్తారు. ఈ మేరకు పోలీసులకు షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. అయితే పోలీసులు మాత్రం జనసేనాని టూర్ లో పలు ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన నేతలకు వాటిని పాటించాలని నోటీసులు కూడా పంపారు. దీంతో పవన్ వైజాగ్ టూర్ మరోసారి ఉత్కంఠ రేపుతోంది.

ఎయిర్ పోర్టు నుంచి పోర్టు రోడ్డులోనే పవన్ కళ్యాణ్ నగరంలోకి రావాలని పోలీసులు సూచించారు. అలాగే మధ్యలో రోడ్ షోలు , కారులో నుంచి బయటికి వచ్చి అభిమానులకు చేతులు ఊపడం వంటి కార్యక్రమాలు కూడా వద్దని తెలిపారు. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు. కానీ పవన్ పర్యటన అంటేనే భారీ ఎత్తున అభిమానులు తరలివస్తారు. అలాంటిది పోలీసులు ముందే ఆంక్షలు విధించడంపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పవన్ గతంలో వైజాగ్ లో పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అప్పట్లో పవన్ వైజాగ్ కు వస్తున్న సమయంలో ఎయిర్ పోర్టులో స్వాగతం పలికేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలు ఎదురుగా వచ్చిన మంత్రులపై రెచ్చిపోయారు. దీంతో వారిపై కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపారు. అలాగే పవన్ కళ్యాణ్ ను సైతం నోవోటెల్ హోటల్ కే పరిమితం చేశారు. పవన్ పై పోలీసుల ఆంక్షలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఇప్పుడు మరోసారి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications