పవన్ కు ఢిల్లీ పిలుపు - టీడీపీ, బీజేపీ పొత్తు వేళ కీలక మలుపు..!!
ఏపీలో పొత్తుల రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఏపీలో 2014 తరహా పొత్తులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఢిల్లీ నుంచి పవన్ కు పిలుపు వచ్చింది. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. సీట్ల పంపకాల పైనే ప్రధానంగా చర్చ జరగనుంది. సీట్లు గురించి ఒక నిర్ణయానికి వస్తే మూడు పార్టీల నుంచి ఉమ్మడి ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది.
Recommended Video

కీలక పరిణామాలు : ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటానికి రంగం సిద్దమైంది. ఇప్పటికే ఎన్డీఏ లో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ ఈ రోజు ఢిల్లీలో బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం కానున్నారు. ఈ సమయంలో ఏపీలో పొత్తులు..సీట్ల సర్దుబాటు గురించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, బీజేపీకి దాదాపు 50 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు కోరుతున్నాయి. చంద్రబాబు 8 ఎంపీ స్థానాలు, 35 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఉమ్మడి అజెండా, మేనిఫెస్టో అంశాల పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు లేదా రేపు టీడీపీ ఎన్డీఏలో చేరిక పైన అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

పొత్తులు..సీట్ల లెక్కలు : జనసేనకు ఇప్పటికే 25-27 అసెంబ్లీ స్థానాలు ఖాయమైనట్లు తెలుస్తోంది. రెండు ఎంపీ స్థానాలు ప్రతిపాదించినా మూడో స్థానంగా అనకాపల్లి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని సమాచారం. ఇదే సమయంలో బీజేపీ 8 ఎంపీ, 25 అసెంబ్లీ సీట్లు కోరినట్లు సమాచారం. చంద్రబాబు 5 ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసారని తెలుస్తోంది. దీని పైన బీజేపీ నుంచి ఇంకా ఆమోదం రాలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ, జనసేనకు కలిపి 10 ఎంపీ, 50 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేలా ఇప్పుడు పవన్ తో బీజేపీ ముఖ్య నేతలు చర్చలు చేయనున్నట్లు సమాచారం. ఆ తరువాత చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి అమిత్ షా ను కలవనున్నట్లు చెబుతున్నారు.

పవన్ మంత్రాంగం : ఆ సమయంలోనే పొత్తులు, సీట్ల గురించి ఒక నిర్ణయానికి రానుంది. ఆ వెంటనే టీడీపీ ఎన్డీఏలో చేరిక ప్రకటన తో పాటుగా ఏపీ వేదికగా మూడు పార్టీల నేతలు తమ పొత్తు..సీట్ల పైన అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం. దీంతో, ఇప్పుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన వేళ..సీట్ల అంశం..కూటమి అధికారంలోకి వస్తే ప్రాధాన్యతల పైన బీజేపీ ముఖ్య నేతలు చర్చించే అవకాశం ఉంది. ఆ తరువాతనే పొత్తు పైన బీజేపీ నుంచి నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. దీంతో, పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన..బీజేపీ నేతలతో చర్చలు..సీట్ల ఖరారు ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలకం కానుంది.












Click it and Unblock the Notifications