పవన్ 'జయకేతనం', రోడ్ మ్యాప్ ఫిక్స్ - కీలక మలుపు..!!
ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయింది. కూటమిగా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకోవటం పైన మూడు పార్టీలు కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో అనూహ్య విజయం దక్కించుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. ఇప్పుడు తన నియోజకవర్గం పిఠాపురం వేదికగా పార్టీ ప్లీనరీకి నిర్ణయించారు. ఈ సభ నుంచే పవన్ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దం అయ్యారు. పార్టీకి రోడ్ మ్యాప్ తో పాటుగా కీలక ప్రకటనకు పవన్ సమాయత్తం అవుతున్నారు.
జయకేతనం వేదికగా
జనసేన. పార్టీ ఏర్పాటు నుంచి నేటి వరకు ఒక సంచలనం. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకుల ను ఎదుర్కొని..2024 ఎన్నికల్లో ఒక ఉప్పెనలా సత్తా చాటింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. పోటీ చేసిన రెండు పార్లమెంట్.. 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. పిఠాపురం నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ ఇప్పుడు డిప్యూ సీఎం హోదాలో అదే పిఠాపురం వేదికగా తన పార్టీ ప్లీనరీకి హాజరవుతున్నారు. జయకేతనం పేరు తో నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా పవన్ జనసేన భవిష్యత్ లక్ష్యాలను ప్రకటించనున్నారు. ఇందు కోసం పక్కా రోడ్ మ్యాప్ ప్రకటించేందుకు సిద్దమయ్యారు.

భారీ ఏర్పాట్లు
పిఠాపురంలో జనసేన సభకు పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. చిత్రాడలో 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో లక్షల మందికి వసతులు సరిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 250 మంది ఆశీనులు అయ్యే విధంగా భారీ వేదిక నిర్మిస్తున్నారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,700 మంది పోలీసు లను మోహరించారు. పవన్ కల్యాణ్ అమరావతి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 3.45 గంటలకు నేరుగా చిత్రాడ చేరుకుంటారు. ఇందుకోసం వేదికకు సమీపంలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈ సభ ద్వారా పవన్ కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందుకే 'థాంక్యూ' పిఠాపురం నినాదంతో సభను నిర్వహిస్తు రు. ఈ 9 నెలల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, మున్ముందు చేపట్టనున్న పనుల ప్రణాళికను సభ ద్వారా వివరించేందుకు పవన్ సిద్దమయ్యారు.
పవన్ కీలక నిర్ణయం
సభ జరిగే 24 ఎకరాల విస్తీర్ణంలో.. 14 ఎకరాల్లో 2 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా ఏడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వేదికను చేరుకునేందుకు మూడు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వేదికపై పవన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సహా 250 మంది ఆశీనులవుతారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలో పవన్ దాదాపు 50 నిమిషాల పాటు చేసే ప్రసంగం పైన ఆసక్తి కొనసాగుతోంది. కూటమి భాగస్వామిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన అటు పాలనా పరంగా.. ఇటు పార్టీ భవిష్యత్ కోసం పవన్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతం లక్ష్యంగా వచ్చే ఎన్నికలు టార్గెట్ గా పవన్ కొత్త రోడ్ మ్యాప్ ప్రకటించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల పైన పవన్ ఏం చెప్పబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications