అది కైలాసం..ఇది మురుగన్ నివాసం: ఇదెక్కడి..!!
Pawan Kalyan: జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇచ్చిన ప్రసంగాల దుమారం తగ్గట్లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి- భవిష్యత్ ముఖచిత్రం ఎలా ఉండబోతోందనే విషయంపై చర్చకు దారి తీసింది. కూటమి భాగస్వామి బీజేపీలో సైతం చర్చనీయాంశమౌతోంది.
రాష్ట్ర, జాతీయ అంశాలపై తన ఉద్దేశమేంటో కుండబద్దలు కొట్టేశారు పవన్ కల్యాణ్.. ఈ సభ ద్వారా. తమిళనాడు రాజకీయాలపైనా వ్యాఖ్యలు చేశారు. అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిని తప్పుపట్టారు. హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందనీ తేల్చి చెప్పారు.

భారత్‌లో లింగ్విస్టిక్ డైవర్సిటీని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఎన్ని భాషలను నేర్చుకుంటే అంత మెరుగుపడతామనీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన త్రిభాషా సూత్రాన్ని అనుసరించక తప్పదనీ ఆయన స్పష్టం చేశారు.
దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ విమర్శించిన సందర్భాలను నెటిజన్లు గుర్తు చేస్తోన్నారు. గతంలో తెలుగేతర సీనియర్ ఐఎఎస్ అధికారిని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా అపాయింట్ చేసినప్పుడూ ఆయన తప్పుపట్టిన విషయాన్ని ప్రస్తావిస్తోన్నారు.
ఈ దాడి తరువాత పవన్ కల్యాణ్ అప్రమత్తం అయ్యారు. తమిళ, హిందీ భాషల్లో సుదీర్ఘ ట్వీట్ పోస్ట్ చేశారు. హిందీని బలవంతంగా రుద్దుతోందంటూ తమిళనాడు వ్యతిరేకిస్తోన్న విధానాల గురించి మాత్రమే ప్రస్తావించానని వివరించారు. జాతీయ విద్యా విధానం 2020 ద్వారా విద్యార్థులకు మాతృభాషతో పాటు ఏ రెండు భారతీయ భాషలు, ఓ విదేశీ భాషను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభించిందని అన్నారు.
హిందీని మాత్రమే కాకుండా ఏ ఇతర ప్రాంతీయ భాషలనైనా ఎంపిక చేసుకోవచ్చని, బహుభాషా విధానం పిల్లలకు విద్యా స్వతంత్రతను అందిస్తుందని చెప్పారు. ఇది జాతీయ సమైక్యతను బలపరుస్తుందని పేర్కొన్నారు. భాషా బంధాన్ని సంరక్షిస్తుందని, ఈ విధానాన్ని తప్పుగా వివరించడం, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించడం సరికాదని అన్నారు.
దానికి కొనసాగింపుగా మరో ట్వీట్ పెట్టారాయన. ఉత్తరాది- హిమాలయాల్లో పరమశివుడి కైలాసం, దక్షిణాది ఆయన కుమారుడు మురుగన్ నివాసం.. వారిద్దరు వెలిసిన ప్రదేశం ఈ భారత దేశం.. ఇది జగన్మాత ఆదేశం అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్‌ను తన వ్యక్తిగత ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు.












Click it and Unblock the Notifications