మైండ్ గేమ్, ఆ కుటుంబాలను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి: జనసైనికులకు పవన్ కళ్యాణ్
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. విదేశాల నుంచి వచ్చాక గత నాలుగు రోజులుగా ఆయన వరుసగా పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఆయా జిల్లా నాయకులతో సమావేశమవుతూ సూచనలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా నేతలతోను భేటీ అయ్యారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని సూచించారు. అలాగే పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోపైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జిల్లాల నేతలతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా నేతలతో మాట్లాడారు.

మద్రాస్ ప్రెసిడెన్సీలోనే పేరెన్నిక
నెల్లూరు బలమైన రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీలోనే రాజకీయానికి నెల్లూరు పేరెన్నిక గన్నది అని చెప్పారు. జనసేన పార్టీ పరంగా ఈ జిల్లాలో యువతరాన్ని రాజకీయ యవనిక పైన నిలపాలనే దృఢ నిశ్చయంతో ఉందని చెప్పారు. అపారమైన యువ బలగం ఈ జిల్లాలో జనసేనకు ఉందని చెప్పారు.

మైండ్ గేమ్‌ను తట్టుకునే శక్తి ఉందనే భావిస్తున్నా
ఈ నెల 9వ తేదీన తర్వాత సమర్థవంతంగా పని చేసే జనసేన జిల్లా కమిటీని ప్రకటిస్తానని చెప్పారు. ఈ కార్యాచరణకు సంబంధించి విజ్ఞులైన వారి నుంచి సలహాలు, సూచనలు ఆశిస్తున్నానని చెప్పారు. ఈ ప్రక్రియలో కొత్తతరంపై మానసిక దాడులు జరిగే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ మానసిక దాడులను, మైండ్ గేమ్‌ను తట్టుకునే శక్తి జనసైనికులకు ఉందనే భావిస్తున్నానని చెప్పారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తమతో కలిస్తే తప్పేమిటని చంద్రబాబు చెప్పగా, దానికి వైసీపీ.. వారిద్దరూ ఒక్కటేనని విమర్శలు గుప్పించడంతో జనసేన ఇరకాటంలో పడింది. దీనిపై పవన్ క్లారిటీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.

దురదృష్టవశాత్తూ కుటుంబాల చేతుల్లో చిక్కుకుంది
జనసేన పార్టీలో యువతరాన్ని ప్రోత్సహించి రాజకీయ యవనికపై నిలపాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్. నెల్లూరు జిల్లా రాజకీయ ఉద్దండులు పుట్టిన జిల్లా అని, అయితే, దురదృష్టవశాత్తూ నెల్లూరు రాజకీయం కొన్ని కుటుంబాల చేతుల్లో చిక్కుకుందన్నారు. అక్కడ రాజకీయాల్లోకి కొత్తతరం రాకుంటే, జిల్లాకి అన్యాయం చేసినట్లే అవుతామని చెప్పారు.

వారసత్వంతో వచ్చిన కుటుంబాలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి
నెల్లూరు జిల్లాలో యువత జనసేనకి పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నారని, రాజకీయంగా పండిపోయిన కుటుంబాలతో ఇక్కడి కొత్తతరం పోటీ పడాల్సిన అవసరముందన్నారు. వారసత్వంతో వచ్చిన కుటుంబాలను రాజకీయంగా ఎదుర్కోవడానికి యువత ప్రజలకు మరింత చేరువ కావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ నెల తొమ్మిదో తేదీ తర్వాత జనసేన జిల్లా కమిటీని ప్రకటిస్తామన్నారు.












Click it and Unblock the Notifications