పవన్ టూర్ లో చొరబడ్డ వైసీపీ కార్యకర్త ? ఉలిక్కిపడ్డ పోలీసులు..!
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. స్థానికంగా కొబ్బరి రైతుల కష్టాలు తెలుసుకోవడంతో పాటు పల్లె పండుగ 2.0 కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజోలులో జరిగిన పవన్ కళ్యాణ్ టూర్ లో ఓ వైసీపీ కార్యకర్త చొరబడినట్లు ఆలస్యంగా గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. దీనిపై పవన్ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు గుర్తించినట్లు బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఆయన కార్యాలయ అధికారులు తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్త ఆయనకు చేరువగా వచ్చినట్లు గుర్తించామన్నారు. ఆ రోజు శంకరగుప్తం డ్రయిన్ మూలంగా దెబ్బ తిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోనూ, అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో, ఆ తరవాతి కార్యక్రమాల్లో సదరు వ్యక్తి డిప్యూటీ సీఎంకు సమీపంలో సంచరించారని తెలిపారు.

ఇతను రాజోలు నియోజక వర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. అతని వ్యవహార శైలి, కదలికలపై అనుమానం వ్యక్తమైందని జనసేన వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తీసుకువెళ్లారన్నారు. కదలికలు, కార్యక్రమానికి జారీ చేసిన పాస్ అతను చేరడంపై ఉన్న సందేహాలను జిల్లా ఎస్పీకి వివరించారన్నారు. దీనిపై తగిన విచారణ చేపట్టాలని కోరినట్లు జనసేన వర్గాలు తెలిపాయి.

గతంలోనూ పవన్ కళ్యాణ్ పర్యటనల్లో అపరిచిత వ్యక్తులు చొరబడ్డారు. గత ఎన్నికల ప్రచార సమయంలో అయితే ఏకంగా బ్లేడ్లతో వచ్చి తన చేతులు కోసేస్తున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పట్లో కేవలం జనసేన అధినేతగా ఉన్న పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయినా ఆయన టూర్లలో అపరిచితుల కదలికలు రిపీట్ కావడం పోలీసుల వైఫల్యంగానే కనిపిస్తోంది. దీనిపై పవన్ సైతం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications