తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కూతురు
Pawan Kalya: రాష్ట్ర రాజకీయాల్లో కొంతకాలంగా రోజూ వార్తల్లో నిలుస్తోన్న తిరుమల తిరుపతి దేవస్థానం డిక్లరేషన్ వ్యవహారం మరోసారి తెర మీదికి వచ్చింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజన పవనోవిచ్ కొణిదెల ఈ డిక్లరేషన్ ఫామ్‌పై సంతకం చేశారు.
తండ్రి పవన్ కల్యాణ్, అక్క ఆద్యతో కలిసి శ్రీవారి దర్శనం కోసం ఆమె మంగళవారం రాత్రే తిరుమలకు వచ్చారు. పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఈ ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. దర్శనానికి వెళ్లడానికి ముందు ఆమె టీటీడీ అధికారులు ఇచ్చిన డిక్లరేషన్‌పై సంతకం చేశారు.

పొలెనా అంజన మైనర్. దీనివల్ల ఆమెతో పాటు ఆ డిక్లరేషన్ ఫామ్‌పై తండ్రిగా పవన్ కల్యాణ్ కూడా సంతకం చేశారు. అంజన పవనోవిచ్.. తల్లి అన్నా లెజినోవా తరఫు నుంచి క్రైస్తవ మత సంప్రదాయాన్ని అనుసరిస్తోన్నారు. గతంలో బాప్టిజాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ సైతం ఒకట్రెండు సందర్భాల్లో బాహటంగా వెల్లడించారు.
శ్రీవారి దర్శనానికి వచ్చిన హైందవేతరులు, అన్యమతస్తులు డిక్లరేషన్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అన్యమతంలో ఉన్నప్పటికీ- శ్రీవేకంటేశ్వర స్వామివారి మీద తనకు అపార భక్తి విశ్వాసాలు ఉన్నాయని, అందువల్లే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చానంటూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
కాగా- అంజన మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు ఆద్య పలుమార్లు మీడియా ముందుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార సమయంలో, కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు, తండ్రితో కలిసి విజయవాడ నుంచి తిరుపతికి బయలుదేరిన వేళా ఆమె కనిపించారు.

ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలను సందర్శించాలనుకున్నప్పటికీ అధికార తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి నాయకులు డిక్లరేషన్ వివాదాన్ని తెర మీదికి తీసుకొచ్చారు. జగన్ క్రైస్తవుడని, డిక్లరేషన్ ఇవ్వక తప్పదంటూ డిమాండ్ చేశారు.
అదే సమయంలో జగన్ తిరుమల పర్యటన మీదా అనేక ఆంక్షలను విధించింది సంకీర్ణ కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులను ఇచ్చింది. కొన్నిచోట్ల వైసీపీ నాయకులను గృహ నిర్బంధంలో సైతం ఉంచినట్లు అప్పట్లో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీనితో జగన్.. తిరుమల పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications