కోర్టుల చుట్టే.. ప్రజలకేం చేస్తాడు: జగన్‌పై పయ్యావుల
అనంతపురం/కృష్ణా: సీమాంధ్ర పునర్నిర్మాణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన శుక్రవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లేనని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అమ్మ పార్టీ అయితే వైయస్సార్ కాంగ్రెస్ బొమ్మ పార్టీ అని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసుపై విచారణ ఏడాదిలోపే పూర్తికావాలన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది మొత్తం కోర్టుల చుట్టే తిరుగుతాడని, ఇక అతను ప్రజలకేం చేస్తాడని ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి పార్టీలోని వారంతా జైలుకెళ్లిన వారేనని పయ్యావుల అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
టిడిపి, జగన్ పార్టీల మధ్య వాగ్వాదం
కృష్ణా: జిల్లాలోని జగ్గయ్యపేటలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వివాదాన్ని సద్దుమణిగేలా చూశారు.












Click it and Unblock the Notifications