రహస్యంగా జగన్ బిల్డింగ్ కాంట్రాక్టర్ బిల్లుల క్లియర్ ? ఆర్ధిక మంత్రి సీరియస్..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇంకా వైసీపీ హవా కొనసాగుతుందనే విమర్శలకు మరో ఆధారం లభించింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన అధికారులు ఇంకా అక్కడే కొనసాగుతున్నారు. వారిలో కొందరు ఇప్పటికీ విపక్ష వైసీపీకి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆర్ధికశాఖలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఇందుకు కారణమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖలో రుషికొండపై సీఎం జగన్ కోసం భారీ భవనం నిర్మించారు. విలాసవంతమైన ఈ భవనాన్ని ఇప్పటికే పలుమార్లు తనిఖీలు చేసిన సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. దీన్ని ఏం చేయాలనే దానిపై మాత్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇలాంటి సమయంలో గతంలో ఈ భవనం కట్టిన కాంట్రాక్టర్లకు ఆర్ధిక శాఖలో అధికారులు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించేసినట్లు తెలుస్తోంది.

ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలు లేకుండా, అనుమతి కూడా లేకుండా కొందరు అధికారులు రుషికొండ ప్యాలెస్ కు ససంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేసినట్లు తెలుస్తోంది. చివరికి విషయం ఆలస్యంగా తెలియడంతో ఆర్థికమంత్రి పయ్యావుల సంబంధిత అధికారులపై ఫైర్ అయినట్లు సమాచారం. రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టరుకు ఎందుకు బిల్లులు చెల్లింపులు చేశారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై పయ్యావుల మండిపడ్డారు. కాంట్రాక్టరుకు బిల్లులు ఎందుకు చెల్లించారో వివరణ ఇవ్వాలని మంత్రి పయ్యావుల బాధ్యుల్ని ఆదేశించారు.
అయితే రుషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులను చెల్లించలేదని అధికారులు ఆర్థికమంత్రికి తెలిపారు. అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లుల చెల్లింపు జరిగినట్టు అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. వేరే బిల్లులైనా సరే ఆ కాంట్రాక్టరుకు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని ఆర్థికమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఓసారి చెప్పినా.. వినకుంటే ఎలా అంటూ మంత్రి పయ్యావుల అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ కాంట్రాక్టరుకు జరిపిన చెల్లింపుల వివరాలు, ఏయే పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications