వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

60 ఏళ్ల ఉద్యమం ఆంధ్రులపై కాదు: పయ్యావుల స్పీచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అరవయ్యేళ్ల తెలంగాణ ఉద్యమం ఆంధ్రుల పైన జరిగిందని అసత్యాలు చెబుతున్నారని కానీ, తెలంగాణ భూస్వామ్య, పెత్తందార్ల, దొరల పాలనకు వ్యతిరేకంగా జరిగిందని టిడిపి నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన శాసన సభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై మాట్లాడారు. ఆయన ప్రసంగానికి తెరాస పలుమార్లు అడ్డు తగిలింది. దానికి పయ్యావుల వారికి మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చని చెప్పారు. చరిత్రలోని నిజాలు మాట్లాడితే ఉలుకెందుకన్నారు.

అబద్దాల పునాదులపై తెలంగాణ ఉద్యమం ఉందని, దానికి సరైన విధంగా సమాధానం చెప్పలేకపోయామన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మాట్లాడాల్సి వస్తుందని తాను ఎప్పుడు అనుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు, అభివృద్ధి అన్నారని, ఇప్పుడు అవి ఎక్కడా కనిపించడం లేదన్నారు. రాయలసీమలో ప్రజలు, పచ్చదనం కనిపించదన్నారు. పిల్లలు, వృద్ధులు మినహా అందరూ వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Payyavula speech in Assembly

తుంగభద్ర నుండి రావాల్సిన నీటి కంటే సగం వస్తున్నాయన్నారు. భావోద్వేగాలలో కొట్టుకుపుతే భవిష్యత్తు తరాలకు నష్టం చేసిన వాళ్లమవుతామని కాబట్టి సమైక్యాంధ్రనే అందరికీ శ్రేయస్సు అన్నారు. స్వార్థపూరిత నిర్ణయాల వల్ల అనంతపురం తన ప్రాభవం కోల్పోతోందని, సమైక్య రాష్ట్రంలో లబ్ధి పొందిన వాళ్లు స్వార్థంతో విడిపోతామంటున్నారని ఆరోపించారు. వెనుకబాటే విభజనకు కొలమానం అయితే మొదట రాయలసీమ నుండి ఆ డిమాండ్ రావాలని అభిప్రాయపడ్డారు. లంకలో పుట్టిన వారంతా రాక్షసులే.. ఆంధ్రలో పుట్టిన వారంతా ద్రోహులే అనడం ఎంత వరకు సమంజసమన్నారు.

మేం ఎందుకు కలిసి ఉంటున్నామంటే...

తెలుగు జాతి వెలుగులకు, తెలుగు ప్రాభవాలకు తాము అడ్డు కావొద్దనే ఉద్దేశ్యంతోనే, తాము దుఖాన్ని దిగమింగుకొని సమైక్యంలో ఉంటున్నామన్నారు. తాము తుంగభద్ర నీటిని, నీటి వాటాను, రాజధానిని కోల్పోయామన్నారు. తమను చూసి స్ఫూర్తి తెచ్చుకొని సమైక్య రాష్ట్రానికి మద్దతు పలకాలని కోరారు. రాష్ట్రంలో వంద రోజుల పాటు ఉద్యమం జరిగితే కేంద్రం తొంగి చూడలేదని, మా గోడు విననప్పుడు మేం ఈ దేశంలో ఎందుకు ఉండాలని సీమ యువత ప్రశ్నిస్తోందన్నారు.

రాయలసీమ యువత ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వెనుకబాటుతనముందన్నారు. సిద్దేశ్వరం ప్రాజెక్టు ఉండి ఉంటే రాయలసీమ సస్యశ్యామలమయ్యేదన్నారు. రాయలసీమ మీద కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేశారన్నారు. రాజకీయ కారణాలతోనే విభజన నిర్ణయమన్నారు. తెలుగు గంగకు శ్రీకారం చుట్టి ఎన్టీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు.

చరిత్ర తవ్వుతూ...

కేవలం కొన్నేళ్ల పాటే విడిపోయి ఉన్నామని, కానీ తెలుగు వాళ్లం ఎప్పుడూ కలిసి ఉన్నామన్నారు. చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. భాష, యాస, సంస్కృతి వేరని విష ప్రచారం చేస్తున్నారన్నారు. తెలుగు వాళ్లం ఎప్పుడు కలిసిలేమో చెప్పాలన్నారు. 1766లో నిజాం కోస్తా ప్రాంతాన్ని వదులుకున్నారన్నారు. కోహినూర్ వజ్రం దొరికింది గుంటూరు జిల్లా కోసూరులో అన్నారు. ఆంధ్రుల చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నారు. పాకిస్తాన్‌ను దాటి ఆఫ్ఘనిస్తాన్ వరకు శాతవాహనుల రాజ్యం ఉందన్నారు.

హైదరాబాదు నిర్మాణంలో అందరి పాత్ర ఉందని, మొదటి నుండి అన్ని ప్రాంతాల పాత్ర ఉందన్నారు. హైదరాబాదు నిర్మాణంలో తమ పాత్ర లేదని ఎలా చెబుతారన్నారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఎప్పుడు స్వతంత్ర పరిపాలనలో లేదన్నారు. చరిత్రలో తెలంగాణ అనేది ఎప్పుడైనా రాష్ట్రంగా ఉందా అన్నారు. చరిత్రలో.. హైదరాబాద్ రాష్ట్రంలోనే తెలంగాణ ఉందన్నారు. నిజాం రాజు అప్పులు తీసుకున్నారని ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు.

హైదరాబాదు ఆంధ్రులదని.. ఎవరు వలసవాదులన్నారు. తమ ప్రాంతంలో తమనే వలసవాదులు అంటారా అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు వారు కలిసి వేల ఏళ్లుగా ఉన్నారని, కలిసి లేరనేది విష ప్రచారం మాత్రమే అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆంధ్రుల పాత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. తెలుగు తల్లిని దయ్యమంటున్నారని కానీ, ఆ తల్లి విగ్రహాన్ని మొదట్లో మహబూబ్ నగర్ జిల్లాలోనే పెట్టారన్నారు. తెలుగు తల్లి అనే పదం మొదట ఉపయోగించింది సురవరం సుధాకర్ రెడ్డియేనని చెప్పారు.

1952లో జరిగిన ఇడ్లి సాంబర్ గో బ్యాక్ ఉద్యమం తమిళులకు వ్యతిరేకంగా జరిగిందని కానీ, దానిని ఆంధ్రులకు ఎలా అంటగడతారని ప్రశ్నించారు. నాడు బూర్గుల ముఖ్యమంత్రిగా కూర్చోవడం ఇష్టం లేని వాళ్లు ఉద్యమాన్ని తీసుకు వచ్చారన్నారు. అరవై ఏళ్ల పోరాటం అని వారు నిత్యం చెబుతున్నారని కానీ, ఎవరి పైన పోరు చేశారని ప్రశ్నించారు. పటేల్, పట్వారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారని గుర్తుంచుకోవాలన్నారు. ఇదంతా చరిత్రలో ఉందన్నారు.

చాకలి ఐలమ్మ ఎవరి పైన పోరాటం చేసిందన్నారు. తెలంగాణ దొరలకు, గడీ దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేశారని చెప్పారు. షేక్ బందగీ తెలంగాణ కోసం పోరాటం చేసిన వీరుడని కానీ, ఆయన ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. బైరాన్‌పల్లి ఉద్యమం సహా అన్ని తెలంగాణ పెత్తందార్లకు వ్యతిరేకంగా జరిగిందన్నారు. ఇదంతా నేటి యువత తెలుసుకోవాలన్నారు. అరవై ఏళ్ల పోరాటం తెలంగాణలోని భూస్వాముల పైనే జరిగిందన్నారు.

దొడ్డి కొమురయ్య నేలకొరుగుతూ జై ఆంధ్రా అన్నారని చెప్పారు. బైరాన్ పల్లి ఘటన మరో జలియాన్ వాలాభాగ్ అన్నారు. ప్రతి తెలంగాణ ఉద్యమం వెనుక కుట్ర ఉందని, ఆంధ్రులకు అంటగడుతున్నారని విమర్శించారు. తెలంగాణ విముక్తి పోరాటంలో ఆంధ్ర మహాసభది కీలక పాత్ర అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం పోరాటం జరిగిందన్నారు. హైదరాబాద్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం విముక్తి దినమే అన్నారు.

నాడు.. నేడు.. కాంగ్రెస్

నాడు కాంగ్రెసు పార్టీ రాజకీయ అవసరం కోసమే ఆంధ్ర ప్రదేశ్‌ను ఏర్పాటు చేసిందని, ఇప్పుడు రాజకీయ అవసరాల కోసమే విభజనకు శ్రీకారం చుడుతోందన్నారు.

అంబేడ్కర్ ఏం చెప్పారంటే...

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఎప్పుడు చెప్పలేదన్నారు. అవిభక్త హైదరాబాదును విడదీసి వరంగల్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ సూచించారన్నారు. హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేయాలన్నారని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ వంటి ఇండియన్ గాంధీలు తెలుగు వారు కలిసి ఉండాలని కోరుకుంటే, ఇటాలియన్ గాంధీ (సోనియా గాంధీ) మాత్రం విడదీయాలనుకుంటున్నారన్నారు.

ఈటెలకు కౌంటర్, శైలజానాథ్‌కు ప్రతి సవాల్

ఈటెల రాజేందర్ 1956 తర్వాత అంశం మాట్లాడమంటున్నారని, అంతకుముందుది చరిత్ర కాదా చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం 1969 విద్యార్థులకు సంబంధించినదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం పెత్తందార్లకు వ్యతిరేకంగా జరిగిందే అన్నారు. తెరాస నేతలు పెత్తందార్లకు వారసులన్నారు. 18వ శతాబ్దంలోని ముల్కీ నిబంధనలకు ఆంధ్రులు ఎలా బాధ్యులు అవుతారని, తెలంగాణ నేతల ఒత్తిడి మేరకే ముల్కీ నిబంధనలు పొడిగిస్తూ వచ్చారన్నారు.

చంద్రబాబుతో వైఖరి చెప్పమనిపిస్తున్న వారు, సోనియా గాంధీతో కూడా చెప్పించాలని పయ్యావుల ప్రతి సవాల్ విసిరారు. (విభజనపై చంద్రబాబు వైఖరి సభలో చెప్పించాలని అంతకుముందు శైలజానాథ్ సవాల్ విసిరారు.) సమైక్య రాష్ట్రంలో కొనసాగితే నీటి సమస్యలు రావన్నారు. పెద్ద మనుషుల ఒప్పందం కాంగ్రెసు పార్టీతో చేసుకున్నదే అన్నారు. తాము మాత్రమే వెనుకబడ్డామని, ఇతరులు పడలేదన్నట్లుగా చెబుతున్నారని విమర్శించారు.

అభివృద్ధి చెందినప్పటికీ వారు విడిపోవాలని కోరుకోవడమేమిటన్నారు. జోనల్ విధానాన్ని తొలగించాలని నాడు కెసిఆర్ సభలో చెప్పారని గుర్తు చేశారు. టిడిపి, కాంగ్రెసు ప్రభుత్వాల హయాంలో తెలంగాణ వారే భారీ నీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్నారన్నారు. సోనియా, విజయమ్మ, కెసిఆర్ కొడుకుల కోసం నిర్ణయాలు జరగవద్దన్నారు. తప్పును సరిదిద్దేందుకు ఎన్టీఆర్ 610 జివో తెచ్చారన్నారు. లబ్ధి పొందిన మీరు ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చని, తమ ఆవేదన అర్థం చేసుకోవాలన్నారు.

హైదరాబాద్ బిర్యానీ రుచి తెలియదు..

హైదరాబాదు బిర్యానీ రుచి తమకు తెలియదని కానీ, తమ రాయలసీమ సంస్కృతిని నిలుపుకునేందుకు రాయలసీమ రుచులు వచ్చాయని అభిప్రాయపడ్డారు. 57 ఏళ్లలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు.. ఇలా అన్నింటిలో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. తనకు హైదరాబాదులో సెంటు భూమి లేదని కానీ, తమ పిల్లల ఉద్యోగాల కోసం ఆందోళన ఉందన్నారు.

తీర్మానం తర్వాతే..

ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విభజనకు అనుకూలంగా సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారన్నారు. సీమాంధ్రులకు ప్రత్యామ్నాయం చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గతంలో అనుసరించిన విధానాలను ఎందుకు అనుసరించడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగంలో పార్లమెంటుకు, శాసన సభకు సమాన హోదా ఉందన్నారు. తీర్మానం పెట్టేందుకు, ఓటింగ్ కోసం ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.

భారత దేశంలో సీమాంధ్ర ప్రజలు ఏమైనా రెండో తరగతి ప్రజలా అని ప్రశ్నించారు. టేబుల్ ఐటంగా విభజన బిల్లును ప్రవేశ పెట్టారని, రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఈ విధానం మార్చకుంటే దేశం విచ్చిన్నానికి దారి తీస్తుందన్నారు. అడ్డగోలు నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు లేవన్నారు. బిల్లులో చాలా లోపాలున్నాయని పయ్యావుల చెప్పారు. రాష్ట్ర విభజన జరిగాక హైదరాబాదులో సీమాంధ్ర రాజధాని ఏమిటన్నారు. మన రాష్ట్ర రాజధానిని తీసుకు వెళ్లి బెంగళూరులో పెట్టుకోవచ్చా చెప్పాలన్నారు. విడిపోతే చెడిపోతామన్నారు.

English summary
Seemandhra Telugudesam Party MLA Payyavula speech in Assembly on Monday on Telangana Draft Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X