నాడు హింసాకాండ, నేడు అంతకుమించి ఘోరకలి: షర్మిల..!!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో రోజు నామినేషన్ల దాఖలు వేళ ఘర్షణలు కొనసాగుతున్నాయి. తొలి రోజు అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకోగా.. ఈ రోజు కడప జిల్లాలో జరిగాయి. రేపు నామినేషన్లకు చివరి రోజు కావటంతో అభ్యర్ధులు ముమ్మరంగా దాఖలు చేస్తున్నారు. పార్టీలు తుది జాబితాలు వెల్లడించాల్సి ఉంది. కాగా, తాజా పరిణామాల పైన పీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు.
నామినేషన్ల పర్వం ప్రారంభం నుంచి ఈ రోజు సైతం రాజకీయ ఘర్షణలు జరుగుతున్నాయి. సీమ జిల్లాల్లో వైసీపీ - టీడీపీ శ్రేణులు ఘర్షణలకు దిగుతున్నాయి. నామినేషన్ల వేళ ఈ రెండు పార్టీల కేడర్ నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్నాయి. ఈ ఘర్షణల పైన పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో అధికార తెలుగుదేశం.. వైసీపీలు రెండు కలిసి దాష్టీక రాజకీయాలు సాగిస్తున్నాయని మండిపడ్డారు. నాడు వైసీపీ హయాంలో హింసాకాండ నడిస్తే, నేడు టీడీపీ హయాంలో అంతకుమించిన ఘోరకలి నడుస్తోందని, ఈ ప్రతీకార రాజకీయాల వల్ల రతనాల సీమ కాస్తా రక్తసీమగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాయచోటి, పుంగనూరు నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న భీకర ఘర్షణలు, దాడులు రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అత్యంత ఆందోళనకరమైన పరిణామాలని ఆమె పేర్కొన్నారు.

షర్మిల కీలక వ్యాఖ్యలు
అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను మరో సౌత్ బీహార్గా మార్చే పరిస్థితులను ఈ రెండు పార్టీలు సృష్టిస్తున్నాయని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు రాజకీయాలకు, రక్తపాతానికి తావులేదని, రాజకీయాలు అంటే ప్రజల అభివృద్ధి కోసం పోటీ పడాలి కానీ ఇలా భౌతిక దాడులకు పాల్పడటం కాదని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పవిత్ర పాలన అని చెప్పుకుంటున్నారని, మరి నిజంగా పవిత్ర పాలనే అయితే ఈ దాడులు, బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల అడ్డగింతలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఐదు అంచెల భద్రత ఉండాల్సిన నామినేషన్ కేంద్రాల వద్ద కిరాయి రౌడీలు, గూండాలు స్వైరవిహారం చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని, అధికార పార్టీకి అండగా నిలుస్తున్న పోలీసు శాఖ బాధ్యత ఏమైందని షర్మిల నిలదీశారు. షర్మిల చేసిన సోషల్ మీడియా పోస్టింగ్ వైరల్ అవుతోంది.













Click it and Unblock the Notifications
