తెలంగాణాకు కేంద్రం రూ.1,230 కోట్ల ప్రాజెక్టులు.. 5 కొత్త రోప్‌వేలు!
తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతిష్టాత్మక పర్వతమాల పథకం నేషనల్ రోప్‌వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలోని ఐదు ప్రముఖ కొండ ప్రాంతాల్లో కొత్త రోప్‌వేల నిర్మాణానికి అధికారిక అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టులకు సుమారు రూ.1,230 కోట్ల అంచనా వ్యయం నిర్ణయించారు. దీనితో కొండ ప్రాంతాల్లో ప్రయాణం సులభతరమై పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కనుంది.
న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జరిపిన ఉన్నత స్థాయి భేటీలో ఈ అనుమతులు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించి తక్షణ ఆమోదం తెలిపింది.

ఈ ఐదు రోప్‌వే ప్రాజెక్టులు యాదగిరిగుట్ట, నాగార్జునకొండ, పెద్దపల్లి రామగిరి ఖిల్లా, నల్లగొండ హనుమాన్ హిల్, నిజామాబాద్ ఖిల్లా రామాలయం వద్ద నిర్మించనున్నారు. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిధిలో పెద్దగుట్ట నుంచి టెంపుల్ సిటీ లేఅవుట్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రోప్‌వే ఏర్పాటు చేస్తారు. భక్తులకు కొండపైకి ఎక్కే కష్టం తగ్గి సులభ ప్రయాణం అందుతుంది.
నాగార్జునకొండలో ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ వారసత్వ క్షేత్రం వద్ద కృష్ణా జలాలు, కొండల పైనుంచి కేబుల్ కార్లలో ప్రయాణించేలా రోప్‌వే సౌకర్యం కల్పిస్తారు. పర్యాటకులకు అపురూప అనుభూతి కలుగుతుంది. పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని చారిత్రాత్మక రామగిరి ఖిల్లాపై కొండ పాదం నుంచి శిఖరం వరకు దాదాపు 2.1 కిలోమీటర్ల మేర రోప్‌వే నిర్మిస్తారు. అటవీ ప్రాంతంలో కాలినడక కష్టాలు తగ్గి సురక్షిత ప్రయాణం అందుతుంది.
నల్లగొండ పట్టణంలోని హనుమాన్ హిల్‌పైకి 1.2 కిలోమీటర్ల పర్యావరణ అనుకూల రోప్‌వే రానుంది. నిజామాబాద్ జిల్లాలోని చారిత్రక ఖిల్లా రామాలయం వద్ద కూడా ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ఈ రోప్‌వేలు అటవీ భూములు దెబ్బతినకుండా, కాలుష్యం లేకుండా పర్యావరణహిత రవాణా సాధనాలుగా ఉపయోగపడతాయి. కేబుల్ కార్లలో ప్రయాణిస్తూ ప్రకృతి రమణీయతను ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.
కేంద్రం నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించిన నేపథ్యంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు, భూసేకరణ, టెండర్ల ప్రక్రియలు వేగవంతం కానున్నాయి. ఈ రోప్‌వేలు అందుబాటులోకి వస్తే పర్యాటకుల సంఖ్య పెరగడమే కాకుండా స్థానిక యువతకు హోటళ్లు, రవాణా, గైడింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తెలంగాణ పర్యాటక రంగానికి ఇది మహర్దశగా నిలుస్తుంది.












Click it and Unblock the Notifications
