తెలంగాణలో విజృంభిస్తున్న 'కల్తీ' మాఫియా.. పెండింగ్ లోనే వేల కేసులు..? పరిష్కార మార్గాలు ఏంటి..?
తెలంగాణలో కల్తీ మాఫియా అంతకంతకూ విజృంభిస్తోంది. తినే ఆహారం.. తాగే నీళ్లు.. ఇంట్లో వాడే పదార్థాలు అన్నీ కల్తీమయంగా మారుతున్నాయి. కల్తీ సామ్రాజ్యం విస్తరిస్తు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఓ వైపు తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విచ్చలవిడిగా దాడులు చేపట్టినా కల్తీ దందా మాత్రం కోరలు చాస్తూనే ఉంది. ఓ వైపు ఎల్ నినో కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు పెరుగుతున్న క్రమంలో ప్రజలు అధిక ఖర్చు పెట్టి వాటిని కొనుగోలు చేసినా ఈ కల్తీ దందా విపరీతరంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత లాభాల కోసం ఆహార పదార్థాలను విషతుల్యం చేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గణాంకాల వివరాలు చూస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) నుంచి వచ్చిన రిపోర్టుల ప్రకారం గత నాలుగైదేళ్లుగా దేశవ్యాప్తంగా చూస్తే ఆహార కల్తీ విషయంలో ఉత్తర్ ప్రదేశ్ టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత రాజస్థాన్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక తమిళనాడు మూడో స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే ఆహార కల్తీ విషయంలో తమిళనాడులో 22.59 శాతంలో తొలి స్థానంలో ఉంది. 66,536 శాంపిల్స్ ను పరిశీలిస్తే అందులో 15,034 శాంపిల్స్ లో కల్తీ జరిగినట్లు తేలిందని FSSAI తేల్చింది. అయితే అత్యంత ఆందోళనకర అంశం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆహార కల్తీ విషయంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో 15,702 శాంపిల్స్ ను టెస్టింగ్ చేస్తే అందులో 2,387 శాంపిల్స్ లో ఆహార కల్తీ జరిగినట్లు స్పష్టం అయిందని రిపోర్టులు వస్తున్నాయి. అంటే రాష్ట్రంలో ఆహార కల్తీ 15 శాతంగా ఉన్నట్లు తేలింది. తెలంగాణ తర్వాత కేరళ, ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తెలంగాణలో ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లోనే అత్యధికంగా కల్తీ అవ్వడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం అనే చెప్పాలి. స్వీట్లు, పనీర్, కోవా, పాలు, అల్లం వెల్లుల్లి, నెయ్యి, వంట నూనెలు, మసాలా దినుసులు, పండ్లు(మామిడి) , టీ పౌడర్ లు, తేనె తదితర పదార్థాలు ఈ లిస్టులో ఉన్నాయి. ఈ కల్తీ పదార్థాలను వాడటం కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్తీ ఆహారం కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో మిర్యాలగూడలోని ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన వైద్యులు శ్రీనివాస్ వన్ ఇండియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.
" కల్తీ ఫుడ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంట్లో ఆహారమే ప్రజలకు ఆరోగ్యం. బయటి ఫుడ్ వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. అలెర్జీ, డయేరియా, ఫుడ్ పాయిజన్ లాంటి సమస్యలు వస్తాయి. అంతేకాక కల్తీ ఆహారం కారణంగా క్యాన్సర్, లివర్ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మెదడుపైనా కల్తీ ఆహారం ప్రభావం చూపుతుంది" అని వైద్యులు కే. శ్రీనివాస్ వన్ ఇండియాతో మాట్లాడారు.
ఇక మిర్యాలగూడలోని శ్రీ బాలాజీ కిరాణ వ్యాపారీ రవీందర్ నాయక్ వన్ ఇండియాతో మాట్లాడుతూ.. తమ షాపులో ఎలాంటి కల్తీ ఆహార పదార్థాలను వినియోగించడం లేదని అన్నారు. ఆహార పదార్థాలపై ప్రభుత్వ మార్క్ ను చూసే తాము కొనుగోలు చేస్తామని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ , హోటల్స్ లో కల్తీ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నవీన్ అనే డిగ్రీ స్టూడెంట్ వన్ ఇండియాతో మాట్లాడుతూ తాము రోజూ సాయంత్రం పానిపూరీ, ఫాస్ట్ ఫుడ్ తింటామని అన్నాడు. ఆ ఆహారం తిన్నాక కాస్త ఇబ్బంది కరంగా ఉంటుందని కల్తీ జరిగే అవకాశం ఉందని కానీ ఫ్రెండ్స్ తో వెళ్లినప్పుడు తప్పట్లేదని వివరించాడు. ఇక ప్రభుత్వం మరిన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చి కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులను అధిక మొత్తంలో నియమించి ఆకస్మిక దాడులు చేపట్టాలని అడుగుతున్నారు.

అదే విధంగా హోటల్స్ , రెస్టారెంట్స్ లో ప్రతి కిచెన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం.. కిచెన్ ను అందరికీ అందుబాటులో ఉంచడం చేయాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆహార కల్తీకి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేసి సంబంధిత హోటల్లు, షాప్స్ ను సీజ్ చేస్తేనే ఇలాంటివి తగ్గుతాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
