విడిపోవడం ఖాయం: టిడిపి-బిజెపిలపై పెద్దిరెడ్డి
చిత్తూరు: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు చెడిపోయేలా ఉందని, త్వరలోనే ఆ రెండు పార్టీలు విడిపోవడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. హుధుద్ తుఫాను నష్టాలకు తాత్కాలిక సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించారని, సిఎం చంద్రబాబు తీరుతెన్నులు చూసి కనీసం రూ. 600 కోట్లుగా ఇవ్వట్లేదని అన్నారు.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 85మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను హత్య చేయించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పోరుబాట
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత గాలికి వదిలేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరుబాట నిర్వహించారు.
ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన పోరుబాటలో భారీ ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఎమ్మెర్వో కార్యాలయం ఎదుట నిర్వహించిన పోరుబాటలో మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు, నాయకురాలు రెడ్డి శాంతి పాల్గొన్నారు.
నర్సన్నపేటలో జరిగిన పోరుబాటలో మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు పాల్గొన్నారు. పొందూరులో జరిగిన పోరుబాటలో మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం పాల్గొని ధర్నా నిర్వహించారు.












Click it and Unblock the Notifications