AP Pensions: ఏపీలో మొదలైన పెన్షన్ల పంపిణీ- ఈనెలలో రెండోసారి..!
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ మొదలైంది. వాయుగుండం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు.రేపు ఆదివారం కావడంతో సెప్టెంబర్ నెల పెన్షన్లను ఈసారి ఒక్క రోజు ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇవాళే ఈ కార్యక్రమం చేపట్టారు. దీంతో ఈ నెలలోనే రెండోసారి లబ్దిదారులు పెన్షన్లు అందుకుంటున్నట్లు అవుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఇవాళ కూడా సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా మండల కేంద్రం ఓర్వకల్లులో పెన్షన్లను స్వయంగా లబ్దిదారులకు అందజేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల కు ఓర్వకల్లు చేరుకునే చంద్రబాబు..అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పించన్ల పంపిణీ గ్రామ సభ వేదిక అయిన రచ్చకట్ట వద్దకు వస్తారు. అక్కడే పెన్షన్లను పంపిణీ చేస్తారు.

కూటమి ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీని ఒక్కరోజులోనే పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించడంతో అధికారులు పరుగులు తీస్తున్నారు. ఇావాళ రాష్ట్రంలో పెన్షన్లు అందుకోలేని వారికి మాత్రం ఎల్లుండి సోమవారం పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అసలే రాష్ట్రంలో వాయుగుండం కారణంగా భారీ వర్షాలు పడుతుండటంతో ఈసారి వంద శాతం పెన్షన్ల పంపిణీ తొలిరోజు పూర్తి కావడం కష్టమేనని భావిస్తున్నారు. అయినా సాధ్యమైనంత మేర పంపిణీ చేయబోతున్నారు. మిగిలిన వారిని సోమవారం తీసుకోవాలని అధికారులు ముందుగానే సూచించారు.












Click it and Unblock the Notifications