కుప్పంకు డబుల్ ఢమాకా, చంద్రబాబు మజాకా, ఎయిర్ పోర్టు ఆశలు, కేంద్రంలో ఆపదవి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కుప్పంలో ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుని వరుసగా ఎమ్మెల్యే అవుతున్న చంద్రబాబు ఈరోజు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు.
ఇదే సమయంలో కుప్పం ప్రజలకు డబుల్ ఢమాకా దక్కనుంది. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు సీఎం అవుతున్న సమయంలో కుప్పం ప్రజలకు మరో శుభవార్త వస్తోంది. కుప్పం నియోజక వర్గంలోని రామాపురంలో విమానాశ్రయం పనులు వేగవంతం అవుతాయని కుప్పం ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శాంతిపురం-రామకుప్పం మండలాల సరిహద్దులోని రామాపురంలో విమానాశ్రయం రానుంది.

2019 జనవరి నెలలో చంద్రబాబు నాయుడు కార్గో ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, వైసీపీ ప్రభుత్వం రావవడం జరిగింది. తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కుప్పంలో శుంకుస్థాపన చేసిన కార్గో విమానాశ్రయం పనుల గురించి పట్టించుకోవడం మానేసింది. అప్పటి నుంచి కుప్పం నియోజక వర్గం ప్రజలు ఎయిర్ పోర్టు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవుతుండటం, అదే టీడీపీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కుప్పం ప్రజలకు ఆశలు చిగిరిస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండటం, టీడీపీ ఎంపీ కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రిగా ఉండటంతో త్వరలోనే రామాపురంలో కార్గో విమానాశ్రయం పనులు వేగవంతం అవుతాయని కుప్పం ప్రజలు అంటున్నారు.
రామాపురంలో కార్గో విమానాశ్రయం ప్రారంభం అయితే చిత్తూరు జిల్లాలోని రైతులకు కలసివస్తుంది. రైతులు పండించే పూలు, పండ్లు, కూరగాయలతో పాటు పచ్చి సరుకు కార్గో విమానాల్లో తీసుకెళ్లి దేశ విదేశాల్లో విక్రయించడానికి చక్కటి అవకాశం ఉంటుంది. దళారీల వ్యవస్థకు ఏమాత్రం అవకాశం లేకుండా రైతులు నేరుగా దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేసుకోవడానికి రామాపురం కార్గో విమానాశ్రయం ఉపయోగపడుతుంది.

కుప్పంతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లెతో పాటు పశ్చిమ ప్రాంతాల్లో రైతులు పండించే కూరగాయలు, పండ్లు, పూలతో పాటు పచ్చి సరుకును రైతులే నేరుగా దేశ విదేశాల్లోని మార్కెట్లకు తరలించడానికి అవకాశం ఉంటుంది. అన్ని ఆలోచించిన టీడీపీ అధినేత చంద్రబాబు 2019 జనవరిలోనే కార్గో విమానాశ్రయానికి శుంకుస్థాపన చేసినా ఇంత వరకు ఆ పనులు ప్రారంభం కాలేదు.
ఇప్పుడు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు, స్నేహితుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు చేతిలో కేంద్ర పౌర విమానయాన శాఖ ఉండటంతో కుప్పంలో అతి త్వరలో కార్గో విమానాశ్రయం పనులు ప్రారంభం అవుతాయని తెలిసింది. ఇదే సమయంలో పుంగనూరు రైతులను ఆదుకుంటే ఆ నియోజక వర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి కూడా చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుందని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద కుప్పం ప్రజలకు ఇప్పుడు డబుల్ ఢమాకా అని అందరూ అంటున్నారు.












Click it and Unblock the Notifications