"ఆరోజు మాట్లాడితే అంతే!.. 'జనవరి27' తీవ్ర సమస్యాత్మకం.."
వచ్చే ఏడాది జనవరి 27న మౌని అమావాస్య వస్తుందని, ఆరోజు పగటిపూట అందరూ మౌనం పాటించాలని లేదంటే సమస్యలు తప్పవని ప్రముఖ జ్యోతిష్కుడు శ్రీనివాస గార్గేయ చెబుతున్నారు.
విశాఖపట్నం: కొత్త సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో.. కొత్త ఏడాది ఓ కొత్త చిక్కు వచ్చిపడిందంటూ ప్రముఖ జ్యోతిష్కుడు, సిద్ధాంతి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది జనవరి 27న మౌని అమావాస్య వస్తుందని, ఇది ప్రతీ ఏటా వచ్చే అమావాస్య లాంటిది కాదని శ్రీనివాస గార్గేయ అంటున్నారు. ఈ అమావాస్య తీవ్ర సమస్యాత్మకమైనదని, ఆరోజంతా మౌనం పాటిస్తేనే సమస్యల నుంచి గట్టెక్క వచ్చునని ఆయన చెబుతున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆరోజు మౌనంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఆదివారం నాడు విశాఖపట్నంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస గార్గేయ ఈ వ్యాఖ్యలు చేశారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన అనంతరం వచ్చే తొలి అమావాస్యను పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారని. ఇది ప్రతీ ఏటా వస్తుందని అన్నారు.
అయితే అన్ని సంవత్సరాల్లా కాకుండా.. ఇప్పుడొచ్చే అమావాస్య సమస్యలతో కూడుకున్నదని ఆయన చెబుతున్నారు. అందుచేత ఆరోజు పగటి పూట మొత్తం మౌనం వహించాలని, లేనిపక్షంలో కనీసం ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకైనా తప్పకుండా మౌనం పాటించాలని శ్రీనివాస గార్గేయ పేర్కొన్నారు.
ఆ సమయంలో ఎవరైనా నోరు విప్పితే.. వారి మీద గ్రహాల దుష్ప్రభావం ఉంటుందనేది ఆయన వాదన. అదే గనుక జరిగితే మరుసటిరోజు నుంచే ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. గ్రహాల గమనంలో మార్పులు సంభవిస్తున్నాయని పేర్కొన్న శ్రీనివాస గార్గేయ.. ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న శనిగ్రహం 2017 అక్టోబర్ 26న సహజ గమనంతో ధనస్సు రాశిలోకి ప్రవేశించవలసి ఉందని అన్నారు.

కానీ ఈ లోపే అతి గమనంతో హడావుడిగా శనిగ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుందని శ్రీనివాస గార్గేయ తెలిపారు. అనంతరం జూన్21వ తేదీ నాటికి శనిగ్రహం మళ్లీ వృశ్చిక రాశిలోకి చేరుకుంటుందన్నారు. కొంతకాలం తర్వాత అక్కడినుంచి సహజ గమనంతో అక్టోబర్ 26న ధనస్సు రాశిలోకి తిరిగి ప్రవేశిస్తుందన్నారు. అందువల్ల 2017వ సంవత్సరం అంత శుభప్రదమైనది కాదని, అందువల్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చంద్రబాబుకు ఢోకా లేదు:
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వచ్చే ఏడాది ఎలాంటి పదవి గండం ఉండబోదంటూ శ్రీనివాస గార్గేయ వ్యాఖ్యానించడం గమనార్హం. చంద్రబాబు సంపూర్ణ ఆయురోగ్యాలతో ఉంటారన్నారు. అయితే ఆ ప్రభావం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాత్రం పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురైనా.. పాలనలో వాటి ప్రభావం ఉండదని తెలిపారు.
వచ్చే ఏడాది భూకంపాలు, విమాన ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయని, ప్రస్తుతం కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు 2018వరకు కొనసాగుతాయని శ్రీనివాస గార్గేయ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications