ఏడుకొండల వాడితో పెట్టుకుంటే ఎవరైనా సరే, ఇదే గతి, కసితో కాదు పగతో ఓట్లు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించిన ప్రజలు ఎవరికి ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టేశారు. వైసీపీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల్లో వ్యక్తిగతంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వైఎస్ జగన్ మినహాయిస్తే మిగిలిన 9 మంది వ్యక్తిగత ఇమేజ్, కొన్ని చోట్ల టీడీపీ నాయకుల బలహీనంగా ఉండటంతో ఆ నియోజక వర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు.
తిరుపతి నగరంలో వైసీపీ స్పీడ్ కు జనసేన బ్రేకులు వేసింది, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన తిరుపతి నగర ప్రజలు చేతిలో గాజుగ్లాసు పట్టుకున్నారు. ఏడుకొండల వాడు కొలువు తీరిన తిరుమల కింద ఉండే తిరుపతి ప్రజలు ఇంతకాలం చాలా ఓపికగా మార్పుకోసం ఎదురు చూశారు. తిరుపతిలోని వ్యాపారులు, సామాన్య ప్రజలతో పాటు టీటీడీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని వెయ్యి కళ్లతో ఎదురు చూశారు.

అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాత ఆంధ్రప్రదేశ్ తో పాటు తిరుపతి ప్రజలకు ఉత్సాహం వచ్చింది. మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా అంటూ అందరూ ఎదురు చూశారు. మే 13వ తేదీ రానే వచ్చింది. తిరుపతి ప్రజల చేతికి వచ్చిన ఓటు అనే ఆయుధంతో వైసీపీకి వ్యతిరేకంగా గాజుగ్లాసు గుర్తు మీద ఓట్లు గుద్దేశారు. వైసీపీ మీద కసితో తిరుపతి ప్రజలు ఓట్లు వెయ్యలేదు. పగ ప్రతీకారం అంటూ జనసేన అభ్యర్థి జంగాలపల్లె శ్రీనివాసులకు మద్దతుగా ఓట్లు వేశారు.
తిరుపతిలో వైసీపీకి అనుకూలంగా దొంగ ఓట్లు వేసిన కొందరిని ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుపతిలో టీడీపీకి టిక్కెట్ ఇవ్వకపోవడం, జనసేనలో కూడా నాన్ లోకల్ కు టిక్కెట్ ఇవ్వడంతో తన కొడుకు కచ్చితంగా ఎమ్మెల్యే అయిపోతాడని సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్పటికే టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన నాయకులు కూడా జంగాలపల్లె శ్రీనివాసుల కోసం తాము పని చెయ్యమని మొదట తేల్చి చెప్పారు.
కొడుకును గెలిపించుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి చెయ్యని ప్రయత్నాలు అన్నిఇన్ని కావు అనే విషయం తిరుపతి ప్రజలకు తెలుసు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డికి గతంలో ఉన్న పరిచాలు, వైసీపీ హైకమాండ్ అండదండలతో కొడుకును గెలిపించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు.
ఏడుకొండల స్వామితో పెట్టుకుంటే ఎంతటివాడైనా అడ్రస్ లేకుండా పోతారని పదేపదే చెప్పిన తిరుపతి ప్రజలు భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడిని చుక్కలు చూపించి ఇంటికి పంపించేశారు. వైసీపీకి వ్యతిరేకంగా తిరుపతి నగర ప్రజలు అందరూ ఒక్కటి అయ్యారు. టీటీడీ చైర్మన్ పదవికి మంగళవారం సాయంత్రం రాజీనామా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికే పరిమితం అయ్యారని వైసీపీ నాయకులే అంటున్నారు.












Click it and Unblock the Notifications