ఏపీ ఎన్నికలపై షాకింగ్ సర్వే రిజల్ట్స్-ఎస్సీ సీట్లలో వీరు-ఎస్టీ సీట్లలో వారికి లీడ్..!
ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్రంలో ఓటర్ల మొగ్గు ఎటు ఉందన్న దానిపై పలు సర్వే సంస్ధలు తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పటివరకూ రాష్ట్రంలో అధికార వైసీపీకి కొన్ని సర్వేలు, విపక్ష ఎన్డీయే కూటమికి మరికొన్ని సర్వేలు మద్దతుగా నిలిచాయి. అయితే రాష్ట్రంలో తొలిసారి అధికార వైసీపీకి ఇప్పటివరకూ అండగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే దానిపై జరిగిన సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి.
రాష్ట్రంలో మొత్తం ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు కలిపి 36 ఉన్నాయి. వీటిలో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా.. మరో 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే వీటిలో ఎవరికి మొగ్గు ఉందన్న దానిపై పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ సర్వే చేసింది. ఇందులో ఎస్సీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఎన్డీయే కూటమివైపు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. అయితే ఎస్టీ నియోజకవర్గాల్లో ఓటర్లు మాత్రం ఎప్పటిలాగే వైసీపీకి జై కొడుతున్నట్లు నిర్దారణ అయింది.

ఈ సర్వేను లోతుగా పరిశీలిస్తే మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీయే కూటమికి ఈసారి 19 సీట్లలో ఆధిక్యం కనిపిస్తోంది. అలాగే అధికార వైసీపీకి మరో 10 సీట్లలో ఆధిక్యం కనిపిస్తోంది. ఎస్సీ నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమి ఈసారి 51.81 శాతం ఓట్లు సాధించే అవకాశమున్నట్లు తేలింది. అలాగే వైసీపీ కేవలం 42.83 శాతం ఓట్లు మాత్రమే సాధిస్తోంది. ఇతరులకు 5.36 శాతం ఓట్లు వెళ్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి 27, టీడీపీ, జనసేనకు ఒక్కో సీటు దక్కాయి.
అలాగే 7 ఎస్టీ నియోజకవర్గాల్ని పరిశీలిస్తే ఇందులో అత్యధికంగా 5 సీట్లలో వైసీపీ ఆధిక్యం, మరో రెండు సీట్లలో ఎన్డీయే కూటమి పార్టీల ఆధిక్యం ఉన్నట్లు సర్వే తేల్చింది. ఎస్టీ సీట్లో వైసీపీకి 48.16 ఓట్లు లభిస్తుండగా.. ఎన్డీయే కూటమి పార్టీలకు 46.49 శాతం ఓట్లు లభిస్తున్నాయి. అంటే కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో ఎన్డీయే వెనుకబడినట్లు అర్ధమవుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఈ 7 సీట్లను ఏకపక్షంగా గెల్చుకుంది.












Click it and Unblock the Notifications