రా కదలిరా అని పిలవగానే జనం నీకోసం ఎందుకు వస్తారు: పేర్ని నాని కౌంటర్!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ప్రకాశం జిల్లా కనిగిరి వేదికగా రా కదలిరా కార్యక్రమాన్ని ప్రారంభించి సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై, జగన్ సర్కారు పనితీరుపై నిప్పులు చెరిగారు. ప్రజలు తనకోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసం కదలి రావాలని పిలుపునిచ్చారు.
ఇక ఈ క్రమంలో చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో మాజీమంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. రా కదలిరా అని పిలవగానే నీకోసం జనం ఎందుకు కదలి రావాలి అంటూ చంద్రబాబును పేర్ని నాని ప్రశ్నించారు. నువ్వు ఎవరికి మంచి చేస్తావని జనం నీకోసం వస్తారంటూ చంద్రబాబునాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఇప్పుడొచ్చి హైదరాబాద్, బెంగళూరు తరహాలో కనిగిరిని అభివృద్ధి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుకు ఎన్నికలు వస్తే బీసీలు గుర్తొస్తారని బీసీల కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చి మ్యానిఫెస్టో మాయం చేశారని పేర్కొన్న ఆయన బీసీలకు గుర్తుండే ఒక మంచి పథకం అయినా తీసుకొచ్చారా అంటూ ప్రశ్నించారు.
జయహో బీసీ కార్యక్రమం కేవలం ఓట్ల కోసమే కదా అంటూ టార్గెట్ చేశారు. బీసీలతో ఓట్లు వేయించుకొని వాళ్ళ బ్రతుకులను ఏమాత్రం మార్చలేదని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు టిడిపి హయాంలోనే కదా పెరిగింది అంటూ ప్రశ్నించారు. నిత్యవసర వస్తువులు నీ హెరిటేజ్ బజార్లలో లో ఏమైనా తక్కువకి ఇచ్చావా అంటూ ప్రశ్నించారు.
నువ్వు పవన్ కళ్యాణ్ 2014లో అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటూ నిలదీశారు. వైయస్ జగన్ సీఎం అయిన తర్వాత లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇక చంద్రబాబు ఎన్నికల్లో అభ్యర్థుల మార్పుపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మీరు మీ అభ్యర్థులను ఎక్కడికైనా మార్చవచ్చు కానీ మేము మారిస్తే తప్పా అంటూ ప్రశ్నించారు.
నీతులు చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి అని మండిపడ్డారు. గతంలో తిట్టుకొని చంద్రబాబు పవన్ ఇప్పుడు డ్రామాలాడుతున్నారని ఇద్దరికీ సిగ్గు లేదంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వెన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరని పేర్ని నాని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications