జగన్‌ను జైలుకు పంపాలనేదే..!!
AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు, విచారణను ఎదుర్కొంటోన్న మాజీ ఐఎఎస్ అధికారి కే ధనంజయ రెడ్డి, పీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పని చేశారు.
ఇప్పుడు వీరిద్దరూ అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపినట్టయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతోన్న మద్యం కుంభకోణం కేసులో వీరిద్దరూ విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32గా ఉన్నారు.

ఏపీలో లిక్కర్ కేసుపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇది రాజకీయ ప్రేరేపితమని వ్యాఖ్యానించారు. అత్యున్నత న్యాయస్థానం బెయిల్ రిజెక్ట్ ఆర్డర్‌లోనే చాలా స్పష్టంగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని చెప్పారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణమెహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల బెయిల్ పిటీషన్లను తిరస్కరిస్తూ సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌లో ప్రస్తావించిన అంశాలను చూస్తే ఈ విషయం తెట్టతెల్లమవుతోందని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్ళిన చంద్రబాబు దానికి ప్రతిగా కక్షతోనే ఈ తప్పుడు కేసును సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటువంటి తప్పుడు కేసులతో వైఎస్ జగన్‌ను భయపెట్టాలని అనుకోవడం వారి అవివేకమని అన్నారు. వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయించాలనే ఉద్దేశంతోనే ఈ కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..ఆరంభించిందని విమర్శించారు.
ఎక్కడా ఒక్క సాక్ష్యం, ఒక్క ఆధారం లేకుండానే ఎవరినో పట్టుకోవడం, వారిని బెదిరించడం వారి వాగ్మూలంతో మరొకరిపై కేసు నమోదు చేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని పేర్ని నాని ఆరోపించారు. స్కిల్ స్కామ్‌లో 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన కేసులో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికిపోయారని గుర్తు చేశారు.
చంద్రబాబు రాజకీయ జీవితం అంతా స్టేల మీదనే కొనసాగుతోందని పేర్ని నాని చెప్పారు. స్కిల్ స్కామ్‌లో దొరికి పోయి చంద్రబాబు 50 రోజులకు పైగా జైలులో ఉన్నారని, దానికి ప్రతీకారంగా వైఎస్ జగన్‌ను అంతకుమించి ఒక్కరోజు అయినా జైలుకు పంపాలనే కక్షతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ లిక్కర్ కేసులో వైఎస్ జగన్, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డి ఎక్కడైనా సంతకాలు చేశారా? ఎవరికైనా లబ్ధి చేకూర్చాలని ఫైళ్లలో సిఫారసు చేశారా? వారు ఇలా చేశారని ఏ ఒక్క అధికారి అయినా ఫిర్యాదు చేశారా? అపట్లో పనిచేసిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీనీ సిట్ ఎలా విచారణ పేరుతో వేధించిందో అందరికీ తెలుసునని పేర్ని నాని అన్నారు.
కూటమి ప్రభుత్వంలో ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎవరో ఒక వ్యక్తి ఇచ్చిన పిటీషన్‌ను అడ్డంగా పెట్టుకుని ఈ కేసును చేపట్టారని పేర్నినాని ఆరోపించారు. గతంలో సీఐడీకి నేతృత్వం వహిస్తున్న వినీత్ బిజ్రాల్ ఈ మొత్తం కేసును పూర్తిగా పరిశీలించి, ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, ఈ కేసును ముందుకు తీసుకువెళ్ళలేనని తెగేసి చెప్పారని పేర్నినాని చెప్పారు.
2014- 2019 మధ్య చంద్రబాబు తన పాలనలో చేసిన అనేక అక్రమాలు, ఆ తర్వాత వాటిపై నమోదైన.. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్, లిక్కర్ స్కామ్, ఏపీ ఫైబర్‌నెట్ స్కాం, అక్రమ మైనింగ్ కేసుల్లో తన నిర్దోషిత్వం నిరూపించుకోలేక, కక్ష పూరితంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటూ కేసు నమోదు చేసినట్లు కనపడుతోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications