తెలుగు రాష్ట్రాల కీలక పిటీషన్లపై సుప్రీంకోర్టులో- ఉత్కంఠత..!!
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి ఎనిమిదిన్నర సంవత్సరాలవుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు. ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు.
ఈ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ పలు పిటీషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస కేంద్ర సహా మరి కొందరు ఈ పిటీషన్లను దాఖలు చేశారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగ లేదని, ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయనేది వారి వాదన.

దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. అఫిడవిట్‌ను దాఖలు చేసింది. విభజన సహేతుకంగా చోటు చేసుకోకపోవడం, సుదీర్ఘకాలంగా పునర్విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించలేకపోవడం.. వంటి చర్యల వల్ల తాము నష్టపోతోన్నామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్, నిధుల-విధుల విభజన, ప్రత్యేక హోదా అంశాలను కూడా ఇందులో పొందుపరిచింది.
పేరెన్స్ పేట్రియా కింద ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ మహ్మఫూజ్ ఏ నాజ్కీ ఈ పిటీషన్ వేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఆస్తుల పంపకాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థించారు. తమ వాటాగా దక్కాల్సిన మెజారిటీ ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉండిపోవడం, సకాలంలో పంపకాలు పూర్తికాకపోవడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తోందని ఏపీ ప్రభుత్వం తన పిటీషన్‌లో స్పష్టంగా పేర్కొంది.
పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల్లో అధికభాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ పిటీషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఇప్పటివరకు రెండుసార్లు విచారణ చేపట్టింది. చివరిసారిగా ఏప్రిల్ 11వ తేదీన విచారణకు వచ్చినప్పటికీ- అది సాధ్యపడలేదు.
దీనితో ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది. ఇవ్వాళ అవి మరోసారి విచారణకు రానున్నాయి. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న సారథ్యంలోని ధర్మాసనం వాటిపై విచారణ చేపట్టనుంది. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠత నెలకొంది. కీలకమైన విభజన చట్టం, అందులో పొందుపరిచిన అంశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications