పిన్నెల్లి విడుదల - నేరుగా, ఉక్కిరి బిక్కిరి..!!
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. నెల్లూరు సెంట్రల్ జైలులో 55 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు షరుతులు విధించింది. నెల్లూరు వైసీపీ మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి..అనిల్ జైలు నుంచి బయటకు వచ్చిన పిన్నెల్లిని పరామర్శించారు. ఆ వెంటనే పిన్నెల్లి మాచర్లకు బయల్దేరారు. ఇదే సమయంలో పిన్నెల్లి పైన నమోదైన ఇతర కేసుల్లో అనుచరుల్లో టెన్షన్ కొనసాగుతోంది.
విడుదల
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మే 13న మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్‌ల ధ్వంసం, టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై దాడితోపాటు మే 14న కారంపూడిలో సీఐపై దాడికి సంబంధించి నమోదైన కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. 55 రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి నిన్న (ఆగస్టు 23) ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్ షరుతులు
బెయిల్ మంజూరు సమయంలోనే పలు కండీషన్లను విధించింది. హైకోర్టు. రూ.50 వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని పిన్నెల్లిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. చార్జిషీట్ దాఖలు చేసే వరకు వారానికి ఓసారి సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్ హెచ్‌వో) ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని, పాస్‌పోర్టును సంబంధిత మేజిస్ట్రేట్ ముందు స్వాధీనం చేయాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
మాచర్లకు పయనం
సాక్షులను ప్రభావితం చేయడం కానీ, బెదిరించడం కానీ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నిన్న సమయం మించిపోవడంతో నిబంధనల మేరకు జైలు అధికారులు విడుదల చేయలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన పిన్నెల్లి మాచర్లకు బయల్దేరి వెళ్లారు. అయితే, పిన్నెల్లి పైన ఇతర కేసుల విషయంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. దీంతో, ఆయన అనుచరుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో..పిన్నెల్లి విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications