Pithapuram Survey: పిఠాపురం విజేత ఎవరో తేల్చేసిన పీపుల్స్ పల్స్..! భారీ తేడాతో..
ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రధాన పార్టీల అధినేతలు పోటీ చేస్తున్న పులివెందుల, కుప్పం కంటే కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పులివెందుల, కుప్పంలో ఈసారి కూడా ఫలితాల్లో ఎలాంటి మార్పు ఉండే అవకాశాలు లేకపోవడం, మరోవైపు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలవ్వడంతో ఈసారి పిఠాపురంలో ఎలాంటి ఫలితం రాబోతుందనే దానిపై ఉత్కంఠ పెరిగిపోతోంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ సర్వే సంస్ధ పీపుల్స్ పల్స్ పిఠాపురంలో తాజాగా సర్వే నిర్వహించింది. అదీ మార్చి 18 నుంచి మార్చి 21 మధ్య నాలుగు రోజుల పాటు ఈ సర్వే ద్వారా పిఠాపురంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. స్ధానికంగా ఉంటున్న కులాలు, మతాలు, వయో వర్గాలు ఇలా పలు శాంపిళ్లను సేకరించింది. పిఠాపురం ఓటర్లలో ఎక్కువగా ఉన్న కాపులతో పాటు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఇతర కులాల ఓటర్ల నుంచి కూడా అభిప్రాయం తీసుకుంది. అనంతరం ఫలితాలు ప్రకటించింది.

పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ 2024 పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో అధికార వైసీపీకి కేవలం 32.7 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని అంచనా వేస్తోంది. అలాగే ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏకంగా 60.3 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల కూటమికి 3.3 శాతం ఓట్లు, ఇతరులకు 3.7 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. అలాగే నియోజకవర్గంలోని పురుషుల్లో 30 శాతం, మహిళల్లో 35 శాతం ప్రజలు వైసీపీని కోరుకుంటున్నట్లు తేలింది. అలాగే 62శాతం పురుషులు, 57 శాతం మహిళలు జనసేన అభ్యర్ధికి మద్దతుగా నిలిచారు.
వయో వర్గాల వారీగా చూసుకుంటే గరిష్టంగా 26-35 ఏళ్ల వయసు కలిగిన 35.6 శాతం ఓటర్లు వైసీపీకి అండగా నిలుస్తున్నారని, 60 ఏళ్లు పైబడిన వారిలో 64 శాతం, 36-45 ఏళ్ల ఓటర్లలో 61.9 శాతం జనసేన అభ్యర్ధికి మద్దతు పలుకుతున్నారని సర్వే తెలిపింది. కులాల వారీగా చూసుకుంటే వైసీపీకి గరిష్టంగా ఎస్సీల్లో 56 శాతం, మైనార్టీల్లో 54 శాతం మద్దతు పలుకుతున్నారు. జనసేనకు కాపులతో కూడిన ఓసీల్లో 65 శాతం, బీసీల్లో 58 శాతం మద్దతు పలుకుతున్నట్లు తేలింది.












Click it and Unblock the Notifications