వెంకయ్య నాయుడి సేవలు కావాల్సిందే: మోడీ-షా మేధోమథనం: ఏం జరుగుతోంది..!
అమరావతి: దేశంలో ఇక ఉప రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ నెల 6వ తేదీన కొత్త ఉప రాష్ట్రపతి కోసం ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి తరఫున జగ్‌దీప్ ధన్‌కర్ పోటీలో ఉన్నారు. రాజస్థాన్‌కు చెందిన ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పని చేస్తోన్నారు. గవర్నర్‌గా అపాయింట్ కావడానికి ముందు భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర పోషించారు.

ఉత్కంఠభరితంగా ఉప పోరు..
ప్రతిపక్షాల నుంచి కేంద్ర మాజీమంత్రి మార్గరెట్ అల్వా రేసులో నిల్చున్నారు. పలు రాష్ట్రాలకు ఆమె గవర్నర్‌గా పని చేశారు. ఈ ఇద్దరిలో ఎవరు ఉప రాష్ట్రపతిగా ఎన్నికవుతారనేది ఉత్కంఠభరితంగా మారింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ జగ్‌దీప్ ధన్‌కర్‌కు అనుకూలంగా ఓటు వేయడం ఖాయం. తటస్థ పార్టీలుగా ఉంటూ వస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ వంటి పార్టీలు ఎన్డీఏ వైపే మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకే ఓటు వేసిన విషయం తెలిసిందే.

మాటల మాంత్రికుడి దారెటు?
ఈ ఎన్నికలతో ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీ కాలం ముగియబోతోంది. కొత్త రాష్ట్రపతి తన బాధ్యతలను స్వీకరించిన మరుక్షణం ఆయన మాజీ కాబోతోన్నారు. దీని తరువాత ఆయన ఏం చేయబోతోన్నారనది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘకాలం పాటు ఆయన భారతీయ జనతా పార్టీలో కొనసాగారు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు. తనదైన ప్రాసలతో ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలను సంధించడంలో వెంకయ్య నాయుడు దిట్ట.

దేశ రాజకీయాలపై..
రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలపైనా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి ముందు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. కర్ణాటక, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పలుమార్లు ఎన్నికయ్యారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాజ్యసభలో తన వాగ్ధాటితో అధికార పక్షాన్ని చాలా సందర్భాల్లో ఇరుకున పెట్టారు.

అనూహ్యంగా.
.
కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న సమయంలో ప్రధాని మోడీ- ఆయనను ఎవ్వరూ ఊహించని విధంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. గెలిపించుకున్నారు. ఇప్పుడిక ఆయన పదవీ కాలం ఇంకొద్దిరోజుల్లో ముగియబోతోంది. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన నాయకుడు కావడం వల్ల- ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. మాజీ ఉప రాష్ట్రపతిగా ఉంటారా? లేక మళ్లీ బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారా? అనేది చర్చనీయాంశమౌతోంది.

మోడీ-అమిత్ షా ఏం చేయబోతోన్నారు?
వెంకయ్య నాయుడి విషయంలో ఏం చేయాలన్నా అది ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుందనేది బహిరంగ రహస్యం. కొన్ని ఈక్వేషన్ల వల్ల ఆయనను రాష్ట్రపతి పదవి అభ్యర్థిగా ప్రకటించలేకపోయారు. ద్రౌపది ముర్మును ఎంపిక చేశారు. మరో విడత ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడినే కొనసాగించే అవకాశాలు లేకపోలేదంటూ మొదట్లో వార్తలొచ్చినప్పటికీ.. అది కూడా వాస్తవ రూపం దాల్చలేదు.

దక్షిణాది నేత కావడం వల్ల.
వెంకయ్య నాయుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నాయకుడు కావడం వల్ల ఆయనను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి బీజేపీ హైకమాండ్ ఇష్టపడకపోవచ్చు. కర్ణాటక మినహాయిస్తే- మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా ఉండటం వల్ల వెంకయ్య నాయుడి సేవలను మరో రకంగా పార్టీ కోసం వినియోగించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఏ పదవి చేపట్టినా.. అది ఉప రాష్ట్రపతి హోదాకు తక్కువే అవుతుంది. అందుకే- ఆయన విషయంలో మోడీ-షా మేధోమథనం చేస్తోన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
