ప్రధాని మోడీ ఏపీ పర్యటన... రాజధాని అమరావతిలో షెడ్యూల్ ఇలా!
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర రాజధాని అయిన అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయనుంది.
ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ ఖరారు
నరేంద్ర మోడీ మే రెండవ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుండి బయలుదేరి ప్రధాని మోదీ అమరావతికి చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు రాజధాని పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది. ఈ భారీ బహిరంగ సభ కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లను మొదలుపెడుతుంది.

సభకు భారీ ప్లాన్
అమరావతి సచివాలయం వెనుక భాగంలో బహిరంగ సభ వేదికను ఇప్పటికే ఎంపిక చేసిన కూటమి ప్రభుత్వం అక్కడినుండే రాజధాని అమరావతి పున ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో జన సమీకరణకు కూడా పక్క ప్లాన్ తో ముందుకు వెళుతుంది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు.
నరేంద్ర మోడీ పర్యటనకు నోడల్ అధికారిగా వీర పాండ్యన్
ఇప్పటికే ప్రధాని పర్యటన నేపథ్యంలో మంత్రుల కమిటీని నియమించి పనులను పురమాయించారు చంద్రబాబు. అమరావతి పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి మొత్తం ఐదు లక్షల మంది ప్రజలు హాజరవుతారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు నోడల్ అధికారిగా వీర పాండ్యన్ ఉన్నారు. ఆయన ఈ మేరకు సిఎస్ విజయానంద్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
సభా ప్రాంగణానికి వెళ్లేందుకు రోడ్లు
ఈ కార్యక్రమానికి ప్రముఖులు, ప్రజలు హాజరు కావడానికి ఎక్కడా రాకపోకలకు అవాంతరం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి వెళ్లడానికి 9 రోడ్లను గుర్తించి, వాటిని సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి ఉనికిని కోల్పోయి శిథిలావస్థకు చేరుకోగా, ప్రస్తుత ప్రభుత్వం రాజధాని అమరావతికి పునరుజ్జీవం పోయడం కోసం రంగంలోకి దిగింది.
మోడీ చేతుల మీదుగా అమరావతి పనులు
ఈ క్రమంలోనే అమరావతిలో నిర్మాణాలకు ఇప్పటికే కొన్ని టెండర్లను ఖరారు చేసిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పనులను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తే బాగుంటుందని భావించి ప్రధానిని కోరింది. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ఖరారైంది. ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎస్పీజీ బృందం భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.












Click it and Unblock the Notifications