మరో విభజన హామీని నెరవేర్చిన ప్రధాని మోడీ..సీఎం జగన్ ధ్యాంక్స్..!
రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల్ని కేంద్రం నిలబెట్టుకోవడం లేదన్న విమర్శల నేపథ్యంలో ఇవాళ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ.. ఓ కీలక సంస్ధకు ప్రారంభోత్సవం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అకాడమీని సీఎం జగన్, పలువురు కేంద్రమంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఏపీలో నాసిన్ అకాడమీ ప్రారంభించడంపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి జరుగుతున్న సన్నాహకాలతో ఇప్పుడు దేశమంతా రామమయం అయిందన్నారు. మహాత్మా గాంధీ కూడా రామరాజ్యం గురించి మాట్లాడేవారన్నారు. రామ్‌లల్లా దీక్షకు ముందు తాను 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. రాముడి జీవితం, ఆయన స్ఫూర్తి, విశ్వాసం భక్తి పరిధిని మించినవన్నారు. రాముడు సాంఘిక జీవితంలో సుపరిపాలనకు ఒక ప్రతీక అని, అతను యావత్ దేశానికి గొప్ప ప్రేరణగా మారగలడని మోదీ చెప్పుకొచ్చారు.

ఏపీ విభజన చట్టంలో భాగంగా 2014లోనే ఈ అకాడమీని ఏపీకి కేటాయించగా.. 2015 ఏప్రిల్లో అప్పటి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శంఖుస్ధాపన చేశారు. దేశంలోనే రెండో క్యాంపస్ అయిన ఈ నాసిన్ ను పాలసముద్రం ట్యాంక్ ఉత్తర గట్టుపై 35 ఎకరాల స్థలంలో రూ.730 కోట్లతో నిర్మించారు. 2022 మార్చి 5న ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. జాతీయ స్థాయి ప్రపంచ స్థాయి శిక్షణా సంస్థ అయిన నాసిన్ లో 80 మంది ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారులు, 1,000 కంటే ఎక్కువ మంది గ్రూప్ ఏ లేదా ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలలోని గ్రూప్ I అధికారులకు ప్రభుత్వంలోని వస్తు సేవల పన్ను విభాగంలో పని చేసేందుకు శిక్షణ లభించనుంది.












Click it and Unblock the Notifications