AP Elections: ఇవాళ మరోసారి ఏపీకి మోడీ-సీమలో సభ-బెజవాడలో రోడ్ షో..!
ఏపీలో ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం మిగిలున్న నేపథ్యంలో ప్రధాని మోడీ తుది విడత ప్రచారానికి ఇవాళ రానున్నారు. ఇప్పటికే మొన్న రాష్ట్రానికి వచ్చి రాజమండ్రి, అనకాపల్లి సభల్లో పాల్గొన్న ప్రధాని.. ఇవాళ ఓ బహిరంగ సభ, మరో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. అయితే ఇప్పటివరకూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా సీఎం జగన్ పై ఆయన నేరుగా విమర్శలు చేయకపోవడంపై టీడీపీ-బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలో చిలకలూరిపేట, రాజమండ్రి, అనకాపల్లి సభల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఇవాళ రాయలసీమలోని చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న రాజంపేట నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో వ్యూహాత్మకంగా మోడీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. అసలే కిరణ్ కూ, పెద్దిరెడ్డి కుమారుడూ మిధున్ రెడ్డికీ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న వేళ మోడీ సభ ఎన్డీయేకు కీలకంగా మారింది.

పీలేరు సభ అనంతరం ప్రధాని మోడీ తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకుని బందరు రోడ్డులో ఏర్పాటు చేసే రోడ్ షోలో పాల్గొంటారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకూ దాదాపు కిలోమీటరుపైగా దూరంలో ఈ రోడ్ షో ఉంటుంది. ఇది పూర్తి చేసుకుని ప్రధాని మోడీ తిరిగి గన్నవరం నుంచి ఢిల్లీకి పయనమవుతారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ మూడు బహిరంగసభల్లో పాల్గొన్నా గత రెండు సభల్లో మాత్రమే వైసీపీ ప్రభుత్వంపై మోడీ విమర్శలు చేశారు. సీఎం జగన్ పై అయితే నేరుగా ఒక్క మాటా మాట్లాడలేదు. దీంతో ఇవాళ జగన్ కు గత ఎన్నికల్లో పూర్తిగా అండగా నిలిచిన సొంతగడ్డ రాయలసీమలో అయినా మోడీ మాట్లాడతారా లేక పైపై విమర్శలకు పరిమితమవుతారా అన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే విజయవాడ రోడ్ షోలో అమరావతికి ఏదైనా హామీలు ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications