‘భోగాపురం’ ప్రారంభ ముహూర్తం ఫిక్స్ - ఎన్నో ప్రత్యేకతలు, గేమ్ ఛేంజర్..!!
భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. అంతర్జాతీయ విమానాశ్రయం గా అన్ని హంగులతో తీర్చి దిద్దిన ఈ ఏయిర్ పోర్టును ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రారంభిస్తారని సీఎం చంద్రబాబు ప్రకటించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా జరగాలని అధికారులను ఆదేశించారు. కొత్త ఎయిర్‌పోర్టుతో రాష్ట్రానికి కొత్త అవకాశాలు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదని.. ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టుగా ప్రభుత్వం చెబుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఇది కీలక కనెక్టివిటీ కేంద్రంగా మారనుంది.విమాన రాకపోకలు ప్రారంభమైన తర్వాత పెట్టుబడులు ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయని అంచనా. అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, సేవా రంగ సంస్థలు ఉత్తరాంధ్ర వైపు దృష్టి సారించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఆ ప్రాంతంలో వచ్చిన అభివృద్ధిని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అదే తరహాలో భోగాపురం కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్
విశాఖ నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి-16కు సమీపంలో సుమారు 2,200 ఎకరాల విస్తీర్ణంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. ప్రస్తుతం విశాఖ నగరంలోని ఐఎన్ఎస్ డేగా నేవల్ ఎయిర్‌బేస్ నుంచి కొనసాగుతున్న పౌర విమానయాన కార్యకలాపాలు దశలవారీగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు మారనున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా జరగాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, పూర్తి స్థాయి హంగుల తో ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేసారు. ఇక.. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావటం ద్వారా ప్రయాణీకులకు ప్రయోజనంతో పాటుగా ఉత్తరాంధ్ర భవిష్యత్ కు గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications