హోదాపై చెప్పాల్సింది ప్రధానే: చంద్రబాబు, కెసిఆర్ ప్రభుత్వంపై నిరసన

విజయవాడ: ప్రత్యేక హోదాపై చెప్పాల్సింది ప్రధాని నరేంద్ర మోడీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విభజన సమస్యలను పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని కూడా ఆయన అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయవాడకు రాజధాని కళ వచ్చిందని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీతో ఈ రోజు ఫోన్‌లో మాట్లాడానని, ఆగస్టు 15వ తేదీ తర్వాత కలుద్దామని చెప్పారని, ప్రధానితో జరిగే భేటీలో అన్నీ వివరిస్తానని చెప్పారు. సెక్షన్ 8, ఉద్యోగుల విభజన, ఐఎఎస్ అధికారుల విభజన, కార్పోరేషన్ల వంటి పలు విభజన సమస్యలున్నాయని ఆయన చెప్పారు. చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని అంటే తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. తన ఢిల్లీ పర్యటన తర్వాత ప్రత్యేక హోదాపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.

రాష్ట్ర విభజన వల్ల అనేక సమస్యలు వచ్చాయని, వాటిని ఇద్దరం కలిసి చర్చించుకుని పరిష్కరించుకుందామని అంటే తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం లేదని, తమ చర్చల్లో పరిష్కారం కాని సమస్యల పరిష్కారం కోసం కేంద్రం వద్దకు వెళ్దామని కూడా చెప్పానని, అయినా ఫలితం లేదని ఆయన అన్నారు.

PM should say on special status to AP: Chandrababu

హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని, ఇరువురు ముఖ్యమంత్రులకు సమాన హక్కులుంటాయని, ఒక ప్రభుత్వంపై మరో ప్రభుత్వం ఆజమాయిషీ ఉమ్మడి రాజధానిలో కుదరదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాలకు సమాన హక్కులు ఉన్నాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. రెండు ప్రభుత్వాలతో భేటీఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని స్పష్టం చేశారు.

విభజన సమస్యలు పరిష్కరించాలని కోరడానికి ప్రధాని నరేంద్ర మోడీని ఎనిమిది సార్లు కలిశానని, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్‌వంటివారిని కూడా పలుమార్లు కలిశానని ఆయన చెప్పారు. తమ మిత్ర పక్షం కాబట్టి బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో కూడా కలిశానని ఆయన చెప్పారు.

తన విశ్వసనీయతను, నిబద్ధతను, ప్రతిష్టను ఎవరూ శంకించలేరని, వారికి రాజకీయాలు కావాలని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా తప్పకుండా రావాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. అనవసరమైన గొడవలు తనకు అవసరం లేదని, ప్రజా ప్రయోజనాల కోసం మరో గంట ఎక్కువ వెచ్చిస్తానని ఆయన చెప్పారు. రాజకీయ కోణంలో తనను ప్రశ్నించేవారికి ఆ ఆర్హత లేదని ఆయన అన్నారు.

రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రతిపక్షాల నాయకులు వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. పలు సమస్యలు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన అన్నారు. మీడియా అండ ఉంటేనే అధికారంలోకి వస్తామనే అభిప్రాయానికి కాలం చెల్లిందని ఆయన అన్నారు.

తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు ఆంధ్రరాష్ట్రానికి రాజధాని అయిందని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అయిందని, దాంతో హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశామని ఆయన అన్నారు. అటువంటి స్థితిలో విభజన సమస్య చాలా సున్నితమైందని, జాగ్రత్తగా పరిష్కరించుకోవాలని సూచించానని, అయినా వినలేదని ఆయన అన్నారు.

ఇరు ప్రాంతాలవారికి ఆమోదయోగ్యంగా విభజన చేయాలని సూచించానని, అలా చేయకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని, తాను అలా చెప్పినప్పుడు తనను ఎగతాళి చేశారని, విభజన చట్టాన్ని ఆమోదించిన తీరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరసించి, కాంగ్రెసుకు ఒక్క సీటు కూడా రాకుండా తీర్పు చెప్పారని ఆయన అన్నారు. విభజన జరిగిన తర్వాత తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్న పార్టీలు సెక్షన్ 8పై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. ఉద్యోగుల పిల్లల స్థానికత సమస్యేనని, ఉద్యోగులు ఎలా కోరుకుంటే అలా చేస్తామని ఆయన చెప్పారు. ఇబ్బందులను ఎదుర్కుంటూనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను భయపడుతున్నట్లు, బెదిరిపోతున్నట్లు మాట్లాడుతున్నారని, చరిత్ర లేనివారు కూడా ఆ రకంగా మాట్లాడుతున్నారని, విశ్వసనీయతనే తనను కాపాడుతుందని, అన్నీ మరిచిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతానని ఆయన చెప్పారు.

వివిధ సందర్భాల్లో రాజకీయ పార్టీలు, నాయకులు మాట్లాడిన తీరును, వారి ప్రవర్తన తీరును ప్రజలకు వివరిస్తానని ఆయన చెప్పారు. వారి వల్ల రాష్ట్రం పరువు పోయిన తీరును ప్రజలకు వివరిస్తానని ఆయన చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఆయన అన్నారు. చరిత్రను నెమరేసుకోకుండా ఇప్పటి విషయాలు మాత్రమే మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. ప్రణాళికా సంఘం, మంత్రివర్గం విషయాలు సాంకేతికపరమైనవని, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి అవసరమైన సహాయం కేంద్రం నుంచి ఉదారంగా రావాలని ఆయన అన్నారు.

తనపై ఆగ్రహంతో, తనపై కుట్రతో రాష్ట్ర విభజన చేశారని, దానివల్ల విభజన సమయంలో తనతో చర్చించకున్నా ఫరవా లేదని, కానీ టిఆర్ఎస్‌ను విలీనం చేసుకుందామని కాంగ్రెసు అనుకుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకరి అండతో అధికారం సంపాదించాలని అనుకుందని, వారితో కూడా విభజనపై చర్చించలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+