వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం డయాఫ్రం వాల్‌:కేవలం పునాది గోడేనా?...అంతకుకుమించా?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:పోలవరం డయా ఫ్రం వాల్...గడచిన మూడు రోజులుగా దీని విషయం మీదే అధికార-ప్రతిపక్ష పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో డయా ఫ్రం వాల్ పూర్తి చేయడంపై అధికార పార్టీ టిడిపి సంబర పడుతుండగా...మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసిపి ఒక పునాది గోడకు ఇంత హడావుడా?...అని ఎద్దేవా చేస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో సహజంగానే జనాల్లో...ముఖ్యంగా విద్యావంతుల్లో...పోలవరం డయా ఫ్రం వాల్ ప్రాధాన్యత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది...ఆ మేరకు ఇంటర్నెట్ లో గత రెండు రోజుల్లో డయా ఫ్రం వాల్ గురించి ఎక్కువమంది అన్వేషించారట. అయితే అక్కడి వివరాలను బట్టి పోలవరం డయా ఫ్రం వాల్ ప్రాధాన్యతను అంచనా వేయడం సరికాదనేది టిడిపి నేతలే కాదు ఇంజనీరింగ్ నిపుణులు కూడా చెబుతున్నారు...అందుకే ఈ పోలవరం డయా ఫ్రం వాల్...గురించిన వివరాలు మీకోసం...

ఆలోచన...ఇప్పటిది కాదు

ఆలోచన...ఇప్పటిది కాదు

పోలవరం ప్రాజెక్టు ఆలోచన ఇప్పటి నేతల మెదళ్లలో పుట్టిన ఆలోచన కాదనేది అసలు నిజం. సుమారు 200 ఏళ్ల కిందటే బ్రిటీష్ సైనికాధికారి కమ్ నీటి పారుదల ఇంజనీర్ అయిన సర్ ఆర్థర్ కాటన్ భారతదేశంలో నదుల అనుసంధానం గురించి తొలి ఆలోచన చేసిన నాటిది. ఆయనే పోలవరం ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తే ఎంతో ఉపయుక్తమని అప్పట్లోనే భావించారట. అయితే ఆనాటి కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పోలవరంలో అది సాధ్యం కాదని ఆయనే నిర్ణయించుకున్నారని చెబుతారు. ఆ తరువాత 1941 లో...ఆంధ్రా-తమిళనాడుల అవిభాజ్య మద్రాసు రాష్ట్ర ప్రధాన ఇంజనీరు, దివాన్ బహుద్దూర్ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్, గోదావరి నది పైన పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించాడు...ఆ తరువాత 1946-47లో ప్రఖ్యాత ఇంజనీరు కె.ఎల్ .రావు ఇచ్చిన నివేదికలో భద్రాద్రి రాముని పేరున దీనిని "రామపాద సాగరం"గా ఈ ప్రాజెక్టును పేర్కొన్నారు.

సాధ్యం కానిది...ఎందుకంటే?

సాధ్యం కానిది...ఎందుకంటే?

అయితే ప్రాజెక్ట్ కడితే బాగుంటుందని అందరికీ తెలిసిందే కానీ...పోలవరంలో ఆ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడమంటే చాలా కష్టమని ఇంజనీర్లు విశ్లేషించేవారు.
ఈ క్రమంలో 1980లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి టి.అంజయ్య ఈ పోలవరం ప్రాజెక్డ్ కు శంఖుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన జరిగినా కేంద్రం అనుమతితో సహా అనేక ఆ ప్రాజెక్ట్ పురిటిలోనే ఆగిపోయింది. ఆ తరువాత మళ్లీ 2004 లో వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకున్నాడు. ఆ క్రమంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన ముఖ్యమైన అనుమతులన్నీ రాజశేఖర్ రెడ్డి పొందగలిగారు. 19 సెప్టెంబరు 2005 న కేంద్రం నుండి క్లియరెన్స్, 25 అక్టోబర్ 2005 న పర్యావరణ అనుమతి, 17 ఏప్రిల్ 2007 న ఆర్ అండ్ ఆర్ క్లియరెన్స్, 19 సెప్టెంబర్ 2008 న వన్యప్రాణి అభయారణ్యం క్లియరెన్స్, 26 డిసెంబర్ 2008 న అటవీ క్లియరెన్స్ 20 జనవరి 2009న సాంకేతిక సలహా కమిటీ క్లియరెన్స్ లను వైఎస్ సాధించారు. అయితే ఆయన హఠాన్మరణంతో మళ్లీ ఆ ప్రాజెక్ట్ అటకెక్కిన పరిస్థితి.

జాతీయ ప్రాజెక్ట్...మళ్లీ చంద్రబాబు...

జాతీయ ప్రాజెక్ట్...మళ్లీ చంద్రబాబు...

2014 లో ఎపి పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇది "జాతీయ ప్రాజెక్టు" అయింది. అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన అనంతరం మళ్లీ ఈ పోలవరం ప్రాజెక్ట్ అంశం తెరమీదకు వచ్చింది. కేంద్రం నుంచి పోలవరం నిర్మాణం ఎపి ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది.అయినా కారణాలేమైనప్పటికీ మరో మూడేళ్లు అంటే 2018 వరకు ఈ ప్రాజెక్ట్ పనులు అంత చురుగ్గా సాగలేదు. అయితే తదనంతర పరిణామాల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేయడాన్ని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం గతంలో ఎన్నడూ లేనంత వేగం పుంజుకుంది.

డయా ఫ్రం వాల్...పూర్వాపరాలు

డయా ఫ్రం వాల్...పూర్వాపరాలు

పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి డయా ఫ్రం వాల్ నిర్మాణం అత్యంత కీలకమనేది వాస్తవం...అసలు డయా ఫ్రం వాల్ అంటే ఏమిటంటే?...ఇది నీటి ఊట నియంత్రణ గోడ అని తెలుగులో అనువదించుకోవచ్చు. ఇది బైటకు చూసేందుకు చిన్ని సిమెంట్ కాలిబాటలా కనబడుతుంది...కానీ దీని నిర్మాణమంతా జరిగేది భూ అంతర్భాగంలో...ప్రాజెక్ట్ నిర్మించ దలుచుకున్న ప్రదేశాన్ని బట్టి దీని నిర్మాణంలో సంక్లిష్టత స్థాయి పెరుగుతుంది. ఆ ప్రకారం చూస్తే పోలవరంలో ఈ డయా ఫ్రం వాల్ నిర్మాణం చాలా క్లిష్టమైనదని అంగీకరించాల్సిందే...అందుకే దీన్ని పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిర్మాణ సంస్థల తోడ్పాటును తీసుకోవాల్సి వచ్చిందనేది కూడా వాస్తవం.

ఇవి కూడా...తెలుసుకోవాలి...

ఇవి కూడా...తెలుసుకోవాలి...

అయితే డయాఫ్రం వాల్‌ గురించి తెలుసుకునేముందు పోలవరం ఒక నీటిపారుదల ప్రాజెక్టు కాబట్టి ఆ తరహా ప్రాజెక్ట్ లో మరో ముఖ్యమైన కట్టడం స్పిల్‌ వే గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. స్పిల్ వే అంటే...నదికి వరద వచ్చినప్పుడు జలాశయం పూర్తిగా నిండిపోయిన తర్వాత ఆ ప్రవాహాన్ని ఒక క్రమపద్ధతిలో బైటకు పొర్లిపోయేలాగా చేసేందుకు గేట్లతో కూడిన కట్టడం ఇది. అయితే ఈ స్పిల్ వే నిర్మాణం చేయాలంటే నది వందల ఏళ్ల గత చరిత్రతో పాటు...ఎంతో ముందు చూపు కూడా కావాలి. అందుకే స్పిల్‌ వే నిర్మించే ముందు ఆ నదికి సంబంధించిన పాత చరిత్ర అంతా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. వందల ఏళ్ల కాలంలో ఆ నదికి ఎంతటి వరదలు వచ్చాయో, దాని ప్రవాహం తీరుతెన్నులు వంటివన్నీ పరిశీలిస్తారు. ఒక్కసారిగా ఒక్క రోజులో ఎంత భారీ స్థాయిలో వరద నీరు ప్రాజెక్ట్ వద్దకు చేరుకోవచ్చో అంచనాకు వస్తారు. అంత నీటి తాకిడిని తట్టుకునేలా...ఆ నీటిని గేట్ల ద్వారా బైటకు వదిలేసేలా స్పిల్ వే నిర్మాణం చేస్తారు.

పోలవరం...స్పిల్ వే...ప్రత్యేకం

పోలవరం...స్పిల్ వే...ప్రత్యేకం

పోలవరం ప్రాజెక్టుకు ఒకేసారి 50 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా తట్టుకుంటూ ఆ నీటిని ఏ ఇబ్బంది లేకుండా గేట్లు ఎత్తేసి వరద నీటిని దిగువకు వదిలి వేయగలిగే కెపాసిటీతో ఈ స్పిల్‌ వే నిర్మిస్తున్నారు. అయితే సర్వసాధారణంగా ఏ ప్రాజెక్టులోనైనా జలాశయానికి స్పిల్‌ వే నది ప్రవాహ మార్గంలోనే, నది మధ్యలోకి వచ్చేలా నిర్మించడం జరుగుతుంది. కానీ పోలవరంలో మాత్రం అలా చేయడం లేదు. కారణం ముందే చెప్పినట్లు పోలవరం నిర్మాణ ప్రాంతంలోని సంక్లిష్టతే. ఇసుక మేటలు అత్యంత లోతు వరకు...అంటే దాదాపుగా 300 అడుగుల కిందవరకూ ఇసుకే ఉన్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో నది మధ్యలో స్పిల్ వే నిర్మాణం సాధ్యం కాదు. ఒకవేల కట్టినా నీటి తాకిడిని తట్టుకోవడం సాధ్యం కాదు. అలా అని అంతర్జాతీయ సంస్థలు సైతం తేల్చేశాయి.
స్పిల్‌ వే స్థలాన్ని కూడా మార్చాలని నిర్ణయించారు.

స్పిల్‌ వే...స్థలం మార్పు...ఇదో స్పెషాలిటీ

స్పిల్‌ వే...స్థలం మార్పు...ఇదో స్పెషాలిటీ

శ్రీశైలం, నాగార్జునా సాగర్ వంటి ప్రాజెక్ట్ ల నిర్మాణ సందర్భాల్లో అక్కడ రాతి నేలలు కావడంతో అసలు ఈ సమస్యే ఉత్పన్నం కాలేదు. పోలవరంలో ఇసుక సమస్యను దృష్టిలో పెట్టుకొని గోదావరి నదీ ప్రవాహ మార్గాన్నే మళ్లించేస్తున్నారు. గోదావరి కుడి గట్టు మీద ఉన్న ఊళ్లను ఖాళీ చేసి అక్కడ ఉన్న కొండల వైపు నదిని మళ్లించేలే ప్రవాహ మార్గాన్ని మార్చారు. ఆ కొండల్లో ఉన్న రాయి ఆధారంగా నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా స్పిల్‌ వే నిర్మిస్తున్నారు. మరోవైపు గోదావరి ప్రవాహాన్ని కంట్రోల్ చేసేందుకు రాతి, మట్టి కట్టతో డ్యాం కడుతున్నారు. దీన్నే ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం అంటున్నారు. గోదావరి నదీ జలాలు రిజర్వాయర్ ప్రాంతంలో నిలిచేందుకు ఈ ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం సహాయపడనుంది. స్పిల్‌ వే మరో చోటికి తరలించారు కాబట్టి ఈ ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం నిర్మాణం కోసం చేపట్టిందే
ఈ డయా ఫ్రం వాల్‌. ఒకరకంగా దీనిమీదే మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణం ఆధారపడి ఉన్నందున దీన్ని అత్యంత పటిష్టంగా నిర్మించాలి...అలాగే నిర్మించారు

డయా ఫ్రం వాల్...మరో స్పెషాలిటీ

డయా ఫ్రం వాల్...మరో స్పెషాలిటీ

పోలవరంలో గోదావరి నదికి అడ్డంగా ఏకంగా 1.5 మీటర్ల మందం వెడల్పుతో 1.38 కిలోమీటర్ల పొడవు వరకు నిర్మించిన డయాఫ్రం వాల్‌ భారతదేశంలోనే లేదు. అంతే కాదు...నదిలో ఏకంగా దాదాపు 90 నుంచి 300 అడుగుల లోతుకు వెళ్లి అక్కడ రాతిని బేస్ చేసుకొని దాని నుంచి ఈ ఊట నీటి నియంత్రణ గోడను నిర్మించుకుంటూ రావడం అనేది భారత దేశంలో ఎక్కడా లేదు. విదేశాల్లో సైతం ఇంత లోతు వరకు డయా ఫ్రం వాల్ ఎక్కడాలేదని ఈ నిర్మాణాలకు ప్రఖ్యాతి గాంచిన బావర్‌ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. పైగా ఈ డయా ఫ్రం వాల్ ను ఎలా బడితే అలా నిర్మించేందుకు లేదు. దీన్ని అట్టడుగు అంటే సుమారు 300 అడుగుల లోతు నుంచి కూడా గోడను నిట్టనిలువుగానే నిర్మించుకుంటూ రావాలి. ఎక్కడా చిన్న తేడా కూడా రాకూడదు. అదే పెద్ద సవాలు.

నిర్మాణం కూడా...డిఫరెంటే

నిర్మాణం కూడా...డిఫరెంటే

ఈ డయా ఫ్రం వాల్ నిర్మాణంలో హైడ్రాలిక్‌ గ్రాబర్లు, బ్లాచింగ్‌ ప్లాంట్లు, ఎంసీ128 వంటి కట్టర్లు....ఇలా పెద్ద పెద్ద యంత్రపరికాలు వినియోగించారు. ఇక్కడ అత్యంత లోతు వరకూ ఉన్న ఇసుకను ఈ యంత్రాల సాయంతో తవ్వుతూ ఆ తవ్విన ప్రాంతంలో మళ్లీ ఇసుక కూరుకుపోకుండా బెంటినైట్‌ ద్రావణం పోస్తూ రాయి తగిలే లోతు వరకు తవ్వుకుంటూ వెళ్లారు. ఆ తవ్విన ఇసుక, మట్టి తదితరాలు పైకి తీసుకువచ్చేందుకు ఒక ప్రత్యేక పంపు ఏర్పాటుచేశారు. ఆ తవ్విన ప్రదేశంలో ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ నింపుతూ కింద రాయి తగిలే వరకు వెళ్లారు. సమాంతరంగా ప్యానెళ్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు. దేశంలో ఈ తరహా, ఈ స్థాయి నిర్మాణం చేసిన సంస్థ ఏదీ లేకపోవడంతో జర్మన్‌ కంపెనీ బావర్‌ను...ఎల్ అండ్ టి జియోతో కలిపి ఈ పనులు పూర్తి చేయించారు.

ప్లాస్టిక్‌ కాంక్రీటు...ఇబ్బంది లేదా?

ప్లాస్టిక్‌ కాంక్రీటు...ఇబ్బంది లేదా?

ఈ డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో సాధారణ కాంక్రీట్ స్థానంలో ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ వాడారు..అయితే దీనివల్ల ఇబ్బంది ఉంటుందా అంటే అదేమీ ఉండదని పైగా ఇంకా మన్నిక ఎక్కువని అంటున్నారు. సిమెంట్‌, ఇసుక, కంకరతో పాటు బెంటినైట్‌ పొడిని నీళ్లతో కలిపి జత చేస్తారు. దీని వల్ల కట్టడం గట్టిగా ఉంటుంది. దీనిలోని స్థితిస్థాపక గుణం వల్ల భూకంపాలు వచ్చినప్పుడు కూడా ఆ ప్రభావాలను తట్టుకుంటుంది. గోదావరిలో లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉంటాయి. ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకే ప్రవాహాలు తగ్గుతాయి. అయినా ఈ ప్రతికూలతలను అధిగమిస్తూ 412 రోజుల్లోనే డయా ఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తిచేశారు. ఇందుకు రూ.430 కోట్లు ఖర్చు అయింది. పూర్తయిన డయాఫ్రం వాల్‌పై ఇక 1.47 కిలోమీటర్ల పొడవునా రాతి, మట్టి కట్ట నిర్మాణం చేపడతారు. ఈ డ్యాం దిగువ భాగంలో దాదాపు 1000 అడుగుల వెడల్పు ఉంటుందని, అది క్రమంగా తగ్గుతూ పైకి వచ్చేసరికి 50 అడుగుల వెడల్పుతో ఉంటుందని తెలిసింది. ఈ నిర్మాణం 2019 డిసెంబర్‌కు పూర్తి చేయాలని లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నారు.

పోలవరం...పూర్తయితే ఏంటి?

పోలవరం...పూర్తయితే ఏంటి?

గోదావరి మిగులు జలాలు ఉన్న నది...కృష్ణానది నీటి కొరత ఉన్న నది...ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక, విశాఖ మహానగరం యొక్క తాగునీటి అవసరాలు, విశాఖపట్నం చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు కూడా తీరుస్తుందని అంచనా. అంతేగాకుండా, విద్యుదుత్పత్తి, జలరవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి, చేపల పెంపకానికి ఉపయోగపడుతుంది. ఈ పథకంలో భాగంగా 80 టి.ఎం.సీల గోదావరి నీళ్లని కృష్ణా నదిలోకి మళ్ళిస్తారు. మిగులు జలాలు అధికంగా ఉన్న నదుల నుండి నీటి కొరత ఉండే నదులకి నీటిని మళ్ళించే బృహత్ పథకం "గంగా - కావేరి నదుల అనుసంధానం"లో పోలవరం పథకం ఒక భాగం. ఇదండీ...పోలవరం డయా ఫ్రం వాల్ నిర్మాణం వెనుక ఉన్న కథ...దీన్ని బట్టి దీని ప్రాధాన్యం ఏంటో మీరే నిర్ణయించేసుకోండి!

English summary
Amaravati: Polavaram diaphragm wall ... For the last three days, the ruling and opposition parties are criticism of one another ont this issue. These are the details of that diaphragm wall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X