పోలవరం సస్పెన్స్: బీజేపీకి సవాల్, కాంగ్రెస్‌పై టీఆర్ఎస్
హైదరాబాద్: పోలవరం అంశం తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు, బీజేపీ, టీడీపీ నేతలను ఇరుకున పడేస్తోంది. ఇప్పటికే పోలవరం ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు లోకసభలో ఆమోదం పొందింది. సోమవారం రాజ్యసభకు రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి టీడీపీ, కాంగ్రెసు, బీజేపీకి సవాళ్ల మీద సవాళ్లు విసురుతోంది.
తమ పార్టీకి రాజ్యసభలో ఒక్కరే ఉన్నారని, ఆయనతో తాము అడ్డుకునే ప్రయత్నాలు చేస్తామని, తమకు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం పైన కాంగ్రెసు పార్టీ తెలంగాణ నేతలు ఒంటి కాలి పైన లేస్తున్నారని అయితే, వారు తమ చిత్తశుద్ధి చూపించుకోవాలంటే రాజ్యసభలో ఈ బిల్లును ఓడించేందుకు కృషి చేయాలని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు.
అవసరమైతే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి అయినా బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ ఎంపీలతో ఓటు వేయించాలని సూచించారు. లోకసభలో బీజేపీకి బలం ఉన్నందున అది నెగ్గిందని, రాజ్యసభలో కాంగ్రెసు పార్టీ మద్దతివ్వకుండా ఆ అవకాశం లేదని తెరాస గుర్తు చేస్తోంది.

రాజ్యసభలో బీజేపీకి బలం లేదని, కాంగ్రెసు పార్టీకి మాత్రమే బలముందని, ఆ పార్టీ అనుకుంటే బిల్లు ఓడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. అలాగే టీడీపీ తెలంగాణ రాజ్యసభ సభ్యులు కూడా చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. వారు బాబుకు తొత్తులుగా ఉంటారో, తెలంగాణకు అండగా ఉంటారో తేల్చుకోవాలని సవాల్ చేశారు.
అలాగే, పోలవరం విషయంలో బీజేపీని కూడా తప్పు చేసిందని తెరాస ఆరోపించింది. పోలవరం ఆర్డినెన్స్ తాము తేలేదని చెబుతున్న ఎన్డీయే... యూపీఏ దారిలోనే వెళ్తే ఎలా అని తెరాస ప్రశ్నిస్తోంది. పోలవరం ఏడు ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ యూపీఏ ఆర్డినెన్స్ తెచ్చింది.
దీంతో బీజేపీ.. తాము తేని ఆర్డినెన్స్ విషయంలో తమను ఎందుకు తప్పు పడుతున్నారని తెలంగాణ బీజేపీ నేతలు ధీటుగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఏ చేసిన తప్పును మీరు ఎలా చేస్తారని తెరాస ప్రశ్నిస్తోంది. మూడు రాష్ట్రాలు పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో బీజేపీ కూడా ఏమాత్రం తగ్గటం లేదు. యూపీఏ ఆర్డినెన్స్ తీసుకు వచ్చినప్పుడు ఎంపీగా ఉన్న కేసీఆర్ ఏం చేశారో చెప్పారలని బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
రాజ్యసభలో సవాల్
రాజ్యసభలో పోలవరంకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందడం ఎన్డీయే ప్రభుత్వానికి సవాలే! ఈ బిల్లును ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అందులో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వమే ఉంది. అంతేకాకుండా రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. మరోవైపు కాంగ్రెసు పార్టీ దీనికి సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నాలు చేస్తోంది. అయితే, కాంగ్రెసు పార్టీ పైన తెరాస ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో రాజ్యసభలో ఈ బిల్లు ఏమౌతుందోననే ఆందోళన పలువురిలో ఉంది.












Click it and Unblock the Notifications