టిడిపి ఎమ్మెల్యే దౌర్జన్యం, భూఆక్రమణ: విదేశాల నుంచి ఫిర్యాదు, అసలేం జరిగింది?
భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించాడన్న ఫిర్యాదుతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన విశాఖ జిల్లాలో కేసు నమోదు అయింది.
విశాఖ: భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించాడన్న ఫిర్యాదుతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన విశాఖ జిల్లాలో కేసు నమోదు అయింది. అనకాపల్లి టిడిపి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతో పాటు అతని అనుచరుల పైన పోలీసులు కేసు నమోదు చేశారు.
పెందుర్తిలో ఎమ్మెల్యేకు స్థలం ఉంది. పక్కనే ఉన్న స్థలాన్ని ఆక్రమించుకునేందుకు అతని అనుచరులు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. అందులో ఉన్న కట్టడాలను కూల్చివేశారు.
పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొస్తున్నారు
మస్కట్‌లో ఉన్న ఆ స్థల యజమాని విషయం తెలుసుకొని ఈ మెయిల్ ద్వారా విశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే పీలా పైన, అతని తనయుడు, పీఏ రమేష్ సహా పలువురి పైన కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది?
పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. విశాఖ ఎంవీపీ కాలనీలో ఉంటున్న ఓ మహిళ పేరిట దాదాపు 25 ఏళ్ల క్రితం పెందుర్తిలో స్థలం కొనుగోలు చేశారు. అందులో ఇల్లు కట్టుకొని, ఓ పోర్షన్లో వారి కుటుంబం ఉంటోంది. మరో ఇంటిని అద్దెకు ఇచ్చారు.

మహిళ భర్త సత్యనారాయణ ఇటీవల మరణించారు. ఉపాధి నిమిత్తం బాధిత మహిళ కొడుకు మస్కట్‌లో ఉంటున్నారు. గత డిసెంబరులో ఎమ్మెల్యే పీలా, అతని కొడుకు శ్రీకాంత్, పీఏ రమేష్‌తో పాటు అనుచరులు ఆ ఇంటి వద్దకు వచ్చి దౌర్జన్యానికి దిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
తక్షణమే ఇల్లు ఖాళీ చేసి తమకు అప్పగించాలని డిమాండ్ చేసారు. ఇల్లు ఖాళీ చేయకుంటే రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే అనుచరులు వారిని తరుచూ వేధించారు. బెదిరింపులు ఎక్కువ కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూ ఆక్రమణ, బెదిరింపులు కింద కేసు నమోదు చేశారు.
ఒమన్ నుంచి ఫిర్యాదు
బాధితురాలి కొడుకు రాజేష్ ఒమన్‌లో ఉంటున్నారని, ఆయన విదేశాల నుంచి తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు. దర్యాఫ్తు తర్వాత వివరాలు వెల్లడి కానున్నాయి.












Click it and Unblock the Notifications