మరో హామీ నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ తాను ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నారు. ఏపీలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. గతంలోనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవం ముందు రోజున ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేసింది. ఆ మరుసటి రోజున పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం .. పోలీసులకు వీక్లాఫ్ అమలు అంశం ప్రస్తావించారు.
సిబ్బంది కొరత కారణంగా అమలు చేయటం లేదనే విషయం ఉన్నతాధికారులు నివేదించారని సీఎం చెప్పుకొచ్చారు. దీంతో, ఖాళీల భర్తీ ద్వారా పోలీసు సిబ్బందికి వీకాఫ్ అమలుకు అవకాశం కలుగుతుందని వివరించారు. దీంతో, ఇప్పుడు ఏపీ పోలీసు శాఖ ఖాళీల భర్తీకి సంబంధించి నోటీఫికేషన్ జారీ చేసింది. 6,511 పోలీసు నియామకాలకు సంబంధించి ఈ నోటీఫికేషన్ జారీ అయింది. అందులో భాగంగా 6100 పోలీసు కానిస్టేబుళ్లను నియామకం చేపట్టారు. వీరిలో 2520 ఏపీపీఎస్సీ కానిస్టేబుళ్లు కాగా, 3,580 మంది సివిల్ కానిస్టేబుళ్లుగా నిర్ణయించారు. అదే విధంగా 411 సివిల్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లో వివరించారు.

315 మంది సివిత్ ఎస్సైలు కాగా, 96 మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ లో స్పష్టత ఇచ్చారు. ఇక..వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న రెండు కేటగిరీల్లోని ఎస్సై అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 22న కానిస్టేబుల్ అభ్యర్ధులకు పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో స్పష్టం చేసారు. కానిస్టేబుల్ నియామకాల్లో హోం గార్డులకు రిజర్వేషన్ కల్పించారు. ఇదే విధంగా.. పోలీసు శాఖలో మిగిలిన ఖాళీలను దశల వారీగా భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, సచివాలయాల్లో పని చేసే ఉద్యోగుల కు సంబంధించిన బదిలీల విషయం పైనా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. త్వరలో ఇతర శాఖల్లో ఖాళీల భర్తీ పైనా నిర్ణయం తీసుకొనే విధంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications