వల్లభనేని వంశీ అరెస్ట్ కు రంగంలోకి పోలీస్ బృందాలు.. వంశీ ఎక్కడున్నారంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఏపీలో గతంలో టిడిపి కార్యాలయాల పైన దాడులకు పాల్పడిన వారి పైన కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా టార్గెట్ చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ
కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారని తాజా సమాచారం.గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18మందిని అరెస్ట్ చేసిన పోలీసులు టిడిపి ఆఫీస్ పై జరిగిన దాడిలో నేరుగా వంశీ పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ఆదేశాలతోనే వైసీపీ మూకలు దాడిచేసి విధ్వంసం సృష్టించారని భావిస్తున్నారు.

టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో 18 మంది అరెస్ట్
ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ అరాచకాల పైన ప్రత్యేక దృష్టి సారించి పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడికి కారకులైన వారి పైన చర్యలలో భాగంగా గత నెల తొమ్మిదవ తేదీన బాపులపాడు ఎంపీపీ నగేష్ తో పాటు 15మందిని, ఆ తర్వాత మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారంతా పరారీలో ఉన్నారు.
వల్లభనేని వంశీ అరెస్ట్ కు టీడీపీ డిమాండ్
అయితే ఈ కేసులో వల్లభనేని వంశీని అరెస్టు చేయకపోవడంతో టీడీపీ శ్రేణుల నుండి విమర్శలు వెల్లువగా మారాయి. వల్లభనేని వంశీ వెనుక ఉండి టిడిపి కార్యాలయం పై దాడి చేయించారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బలంగా భావిస్తున్నాయి. వల్లభనేని వంశీ గత నాలుగేళ్లుగా పార్టీ శ్రేణులను వేధించారని, నియోజకవర్గంలో యువ గళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని కూడా టిడిపి శ్రేణులు తీవ్రంగా భావిస్తున్నాయి.
హైదరాబాద్ కు పోలీస్ ప్రత్యేక బృందాలు
ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని అరెస్టు చేయాలని పోలీసులపైన టిడిపి నేతలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధర్ రావు ఈ కేస్ పైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. నిన్న మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కి వెళ్ళాయి. వల్లభనేని వంశీ కుటుంబం ఎన్నికల ఓటమి తర్వాత హైదరాబాద్ లోనే ఉండడంతో వంశీ అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి.
వల్లభనేని వంశీ ఎక్కడ
అయితే ఇప్పటికే వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళిపోయి ఉంటారన్న ప్రచారం జోరుగా సాగుతుంది మరి ఈ క్రమంలో వల్లపునేని వంశీ విషయంలో పోలీసులు ఏం చేయబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది. నిజంగానే వంశీ విదేశాలకు వెళ్ళారా అన్నది కూడా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications