ఆ ''ముగ్గురు'' జనసేనవైపు చూస్తున్నారు!!
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేస్తాయా? లేదా? అనే సందిగ్ధత నిన్నటివరకు ఉండేది. ఎప్పుడైతే పవన్ కు సంఘీభావం తెలియజేయడానికి చంద్రబాబు విజయవాడలోని హోటల్ కు వచ్చారో.. ప్రజాస్వామ్య పరిరక్షణకు తమతోపాటు కలిసివచ్చే పార్టీలను కూడా కలుపుకొని వెళ్తామని ప్రకటించడంతో చిన్నపాటి అనుమానం కూడా పటాపంచలైపోయింది. పోత్తు కుదుర్చుకొని పోటీ చేయడం ఖాయమైంది. దీంతో రాష్ట్రంలో మూడురకాల నాయకులు (ముగ్గురు) జనసేనలోకి వెళ్లే విషయమై ఆలోచన చేస్తున్నారు.

అవసరమైతే జనసేనలోకి వెళ్లి టికెట్ తెచ్చుకుందాం!!
ఈ కలయిక కొంతమంది నేతలపై ఉన్నపళంగా బక్కెట్ నీళ్లు గుమ్మరించినట్లవుతోంది. ఇన్ ఛార్జిలను నియమించని నియోజకవర్గాల్లో తెలుగు దేశం పార్టీ తరఫున ఒకరికి మించి పనిచేసుకుంటున్నారు. నియోజకవర్గాలవారీగా నాయకులందరినీ పిలిపించి చంద్రబాబు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పనితీరు బాగున్నవారిని మెచ్చుకుంటూ, పనితీరు బాగోనివారిని హెచ్చరిస్తూ వస్తున్నారు. బాబు హెచ్చరికలు వారిలో మరో ఆలోచనకు కారణమవుతున్నాయి. తాము ఇంతకాలం పనిచేసుకుంటూ, ఒక పునాదిని ఏర్పాటు చేసుకున్నామని, ఒకవేళ తాము పనిచేసుకుంటున్న నియోజకవర్గాలేవైనా జనసేనకు కేటాయించే అవకాశం ఉంటే... అవసరమైతే జనసేన పార్టీలోకి వెళ్లైనా సీటు తెచ్చుకొని పోటీచేయాలనుకుంటున్నారు.

వేటిని జనసేనకు కేటాయించే అవకాశం ఉంది?
టీడీపీ-జనసేన పొత్తు గురించి ఆలోచించకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తున్న నాయకులు మీమాంసలో పడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరితే అప్పటివరకు బలంగా ఉన్న స్థానాలను కూడా జనసేనకు టీడీపీ ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. పొత్తులో భాగంగా వేటిని జనసేనకు కేటాయిస్తారు? తాము ఎక్కడ పనిచేసుకుంటే ఎమ్మెల్యే అవుతాము అనే ఆలోచనతో కొందరు నేతలు రంగంలోకి దిగారు.

మంత్రి పదవుల కోసం జనసేనలోకి..!
తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రి పదవులు దక్కవనే భావనలో మరికొందరు నేతలున్నారు. వీరికి ప్రత్యామ్నాయంగా జనసేన కనపడుతోంది. ఆ పార్టీలో చేరి సీటు దక్కించుకొని గెలవాలనే యోచనలో ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మంత్రిగా తమ కల నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే జనసేనానికి, ఇతర సీనియర్ నేతలకు వారు టచ్ లోకి వెళ్లారు. దీన్నిబట్టి త్వరలోనే జనసేనలో భారీగా చేరికలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతోపాటు స్వల్ప స్థాయిలో వైసీపీ నుంచి జనసేనలోకి జోరుగా చేరికలు ఉండే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ఈ తరహా చేరికలకు పవన్ కల్యాణ్ పచ్చ జెండా ఊపితేనే సాధ్యమవుతుంది. ఆయన అంగీకరిస్తారా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications